ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని అరుణపూర్ అడవుల్లో కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలపై మావోలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లతో పాటు దూరదర్శన్‌కు చెందిన కెమెరామెన్ ప్రాణాలు కోల్పోయారు.

నవంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను కవర్ చేయడానికి దూరదర్శన్‌ ప్రతినిధులు దంతెవాడ జిల్లాలో మకాం వేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో కలిసి వారు అరుణ్‌పూర్ వెళ్తుండగా మావోలు కాల్పులకు దిగారు.

ఈ కాల్పుల్లో ఇన్స్‌పెక్టర్ రుద్ర ప్రతాప్, అసిస్టెంట్ కానిస్టేబుల్ మంగాలు అక్కడికక్కడే మరణించగా.. ఢిల్లీకి చెందిన దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహూ తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. మరికొద్దిరోజుల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మావోల దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.