మొహాలీ: పంజాబ్ లోని మొహాలీలో ఓ మూడంతస్థుల భవనం కుప్ప కూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టారు. 

పక్కన గల ప్లాట్ లో పనిచేస్తుండగా జేసీబీ భవనం గోడను ఢీకొట్టింది. దాంతో భవనం కుప్పకూలింది. ఈ సంఘటన ఖరార్ - లాండ్రాన్ రోడ్డులోని జెటిపీఎల్ సిటీ ప్రాజెక్టులో జరిగింది. 

బేస్ మెంట్ నిర్మాణం కోసం పక్కన గల ప్లాట్ లో జేసీబీతో తవ్వకం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రమాదం జరిగి భవనం కూలిపోయింది. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. మరో ఇద్దరుతి పోటా జేసీబీ ఆపరేటర్ శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు మొబైల్ ఫోన్ల ద్వారా సహాయక సిబ్బందితో మాట్లాడుతున్నారు.

శిథిలాల కింద ఎంత మంది ఉన్నారనే విషయం తెలియడం లేదు. మూడంతస్థుల భవనం కూలిన సంఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ సిబ్బందితో పాటు మొహాలీ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్చలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 

సంఘటనపై నివేదిక సమర్పించాలని మొహాలీ డీసీ గిరీష్ దయాళన్ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలను జోడిస్తూ ఆయన ఆ మేరకు ఓ ట్వీట్ చేశారు