New Delhi: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకించారని ఆప్ నాయకుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు.
Delhi Chief Minnister Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. ఆప్ నాయకుడు, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆరోపించారు. మనీష్ అరెస్టును చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆయనపై అపారమైన గౌరవం ఉందనీ, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. కానీ ఆయనను అరెస్టు చేయడానికి రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందనీ, దీని కారణంగానే వారు తమ రాజకీయ యజమానులకు విధేయత చూపవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు.
ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ లో ఖచ్చితమైన వర్గాల నుండి అందిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారని అన్నారు. ఆప్ ను అణగదొక్కాలని బీజేపీ చూస్తోందనీ, ఇది ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి అన్నారు. మోడీ శాశ్వత వ్యక్తి కాదని సీబీఐలో ఉన్న కొద్దిమందికి మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. ఎనిమిది గంటలకు పైగా విచారణ అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ప్రస్తుతం రద్దు చేసిన 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.
సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రాకముందే ఆప్ అగ్రనేతలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పార్టీ సీనియర్ నేత అరెస్టు తప్పదని ప్రకటించారు. తప్పుడు ఆరోపణలతో తనను అరెస్టు చేస్తారని ముందే సిసోడియా తెలిపారు. ఎక్సైజ్, ఆర్థిక, విద్యా శాఖలను నిర్వహించిన ఢిల్లీ మాజీ మంత్రిని అరెస్టు చేసి భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం కింద 'నేరపూరిత కుట్ర, మోసం చేసే ఉద్దేశం' కింద కేసు నమోదు చేశారు. సిసోడియా మద్యం విక్రేతలకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారనీ, మద్యం లాబీకి అక్రమ డిస్కౌంట్ ఇచ్చారని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతితో విధానాన్ని మార్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. మనీష్ సిసోడియా పొంతనలేని సమాధానాలు ఇచ్చారనీ, విచారణకు సహకరించలేదని సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సిసోడియా, 'దేశంలో పెద్దమనుషులు, దేశభక్తులు, మంచివారు, నిజాయితీపరులను ఎలా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారో మనం చూస్తున్నాం. స్నేహితులు కాబట్టే కోట్లాది రూపాయల బ్యాంకులను దోచుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ సర్కారుపై ఫైర్ అయ్యారు. దేశంలో ఆప్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ను చూసి మోడీజీ భయపడుతున్నారన్నారు. రాహుల్ గాంధీకి గానీ, మరే ఇతర నేతకు గానీ ఆయన భయపడటం లేదని, కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే భయపడుతున్నారన్నారు. ఆప్ ను, కేజ్రీవాల్ ను అణగదొక్కాలని చూస్తున్నారని తెలిపారు. ఆప్ కు ప్రజాదరణ పెరిగే కొద్దీ తమపై తప్పుడు కేసుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.
