Indian Railway:  ఒక వ్యక్తి  ఇండియన్  రైల్వేస్ నుండి రూ.35 రీఫండ్ పొందడానికి ఐదేళ్ల పోరాటం చేసి.. విజయం సాధించాడు. ఈ క్రమంలో దాదాపు మూడు లక్షల మందికి సాయం చేశారు. 2.98 లక్షల IRCTC వినియోగదారులకు రూ. 2.43 కోట్ల రీఫండ్‌లను రైల్వే ఆమోదించింది. 

Indian Railway: ఓ వ్యక్తి 35 రూపాయల రిఫండ్‌ కోసం భారతీయ రైల్వేతో ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు. సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేసి.. చివరికి విజయం సాధించాడు. తన తో పాటు దాదాపు 3 లక్షల మంది IRCTC వినియోగదారులకు ప్రయోజనం కలిగించాడు. వారందరికీ రైల్వే శాఖ రూ.2.43 కోట్లు రిఫండ్‌ చేసేందుకు అంగీకరించింది. 

రాజస్థాన్‌లోని కోటకు చెందిన సుజీత్‌ స్వామి అనే ఇంజనీర్‌ 2017 ఏప్రిల్‌లో.. జూలై 2న తన స్వస్థలం గోల్డెన్ టెంపుల్ మెయిల్ నుండి న్యూఢిల్లీకి వెళ్తేందుకు రైల్వే టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. అదే ఏడాది జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన టికెట్‌(రూ.765)ను రద్దు చేసుకున్నారు. క్లరికల్‌ చార్జీ కింద రూ.65, సేవా పన్ను కింద రూ.35 మినహాయించుకుని రూ.665 రిఫండ్‌ చేసింది రైల్వే శాఖ. త‌న 35 రూపాయాల‌ను ఎందుకు క‌ట్ చేశార‌ని, తాను జీఎస్టీ రాకముందు టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నానని, అప్పుడు సేవా పన్ను లేనందున రూ.35 రిఫండ్‌ చేయాలని రైల్వే శాఖ‌ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్వామి... ప‌లు మార్లు రైల్వే, ఆర్థిక మంత్రిత్వ శాఖకు RTI ద్వారా తెలియ‌జేశారు. అలా రూ. 35 వాపసు కోసం తన పోరాటాన్ని ప్రారంభించారు. 

ఆయ‌న సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేయడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. అంత‌టితో ఆగ‌కుండా.. రిఫండ్‌ చేయాలని కోరుతూ.. ప్రధాని, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జీఎస్టీ కౌన్సిల్‌, ఆర్థిక మంత్రిని ట్యాగ్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేశారు. మొత్తం మీద ఆయ‌న పోరాటానికి రైల్వే శాఖ సంధించింది. ఆర్‌టిఐ ప్రశ్నకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సమాధానంగా.. 2.98 లక్షల మంది IRCTC వినియోగదారులకు మొత్తం రూ. 2.43 చొప్పున ఒక్కో టిక్కెట్‌పై రూ. 35 వాపసు పొందుతారని పేర్కొంది. 

ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక మంత్రికి ట్యాగ్ చేస్తూ తాను పదే పదే చేసిన ట్వీట్లు.. 2.98 లక్షల మంది వినియోగదారుల రీఫండ్ ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని స్వామి చెప్పారు.

 RTI ప్రత్యుత్తరం ప్రకారం.. IRCTC రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య సర్క్యులర్ నంబర్. 43ని ఉటంకిస్తూ.. GST అమలుకు ముందు బుక్ చేసిన, GST అమలు తర్వాత రద్దు చేయబడిన టిక్కెట్లకు బుకింగ్ సమయంలో వసూలు చేసిన సేవా పన్ను తిరిగి చెల్లించబడదని పేర్కొంది. అందువల్ల, రద్దు చేసిన టిక్కెట్‌పై రూ. 100 (రూ. 65 క్లరికల్ ఫీజు మరియు రూ. 35 సేవా పన్ను) వసూలు చేయబడింది. అయితే, జూలై 1, 2017లోపు బుక్ చేసుకున్న, రద్దు చేసిన టిక్కెట్‌లకు, బుకింగ్ సమయంలో విధించిన సేవా పన్ను మొత్తం తిరిగి చెల్లించబడుతుందని RTI ప్రత్యుత్తరం పేర్కొంది. అందుచేత రూ.35 మొత్తాన్ని వాపసు చేయనున్నట్లు తెలిపింది.