జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీష్‌ చంద్ర ముర్ము బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో.... కేంద్ర మాజీ మంత్రి మనోజ్‌ సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ముర్ము రాజీనామాను ఆమోదించారు. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్‌ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది

ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్‌ సిన్హా సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా గతంలో పనిచేసారు.  ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 

ఐఐటీ వారణాసి నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న సిన్హా... విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ యూనియన్‌ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ సిన్హా... మంత్రిగా ఎదిగారు. 

సరిగ్గా సంవత్సరం క్రితం జమ్మూకశ్మీర్ కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలా రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ముర్ము గత అక్టోబర్‌లో నియమితులయ్యారు. 

జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కింద జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న ఆగస్టు 5 రోజునే ముర్ము తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ముర్ము కాగ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ క్యాడర్ కి చెందిన ముర్ము మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో కీలకమైన పదవుల్లో పనిచేసారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్ రిషి. ఇంకో వారంలో రిటైర్ అవ్వబోతున్న నేపథ్యంలో, రాజ్యాంగబద్ధమైన పోస్టును ఖాళీగా ఉంచకూడదు గనుక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియవస్తుంది.