Manish Tiwari on Agnipath: అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా విమర్శిస్తుండగా.. ఆ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ మాత్రం అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించారు. ఆయన ప్రకటన పార్టీ వైఖరికి విరుద్దంగా ఉండటం చర్చనీయంగా మారింది.
Manish Tiwari on Agnipath: సైనిక బలగాల నియామకంలో కేంద్రం నూతన ఒరవడికి శ్రీకారం చూడుతూ.. ప్రవేశపెట్టిన పథకమే అగ్నిపథ్. అయితే.. ఈ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో వివిధ వర్గాల నుంచి నిరసనలు మిన్నంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఇలా ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీశ్ తివారీ మద్దతు లభించింది. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు. ఆయన ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.
ఇది చాలా అవసరమైన సంస్కరణ అని, ఇది సరైన దిశలో సరైన సమయంలో తీసుకున్న సంస్కరణ అని తివారీ అన్నారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై ఆందోళన చెందుతున్న యువత పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. వాస్తవమేమిటంటే.. భారతదేశానికి అత్యాధునిక ఆయుధ సాంకేతికతతో కూడిన యువ సాయుధ దళం అవసరం. ఈ రోజున మొబైల్ ఆర్మీ, యువ రక్తంతో కూడిన ఆర్మీ మీకు కావాలి. ఆయుధాలు, టెక్నాలజీ వినియోగంపై మరింత అనుభవజ్ఞులు మీకు అవసరం. ఒకవేళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోకపోతే భారీగా నగదు కోల్పోవాల్సి వస్తుందన్నారు. దశాబ్ధాల తరబడి కొనసాగిస్తున్న వార్‌పేర్ సంప్రదాయంలో మార్పు రావాల్సి ఉందన్నారు.
గత 30 ఏండ్ల క్రితం సైనిక బలగాలంటే.. అత్యంత ఖర్చుతో కూడిన బలగాలు.. కానీ, నేడు అత్యాధునిక టెక్నాలజీ రావడంతో యువత పెద్ద పీట వేయాల్సి అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో సైనిక నియామకాల్లో తీసుకురావాల్సిన సరైన సంస్కరణ అని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీవ్రంగా విమర్శించగా, ఆ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. పార్టీ వైఖరికి భిన్నంగా మనీశ్ తివారీ వ్యాఖ్యానించడంతో ఆయన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి?
దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సమూల మార్పు చేస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సైనికుల నియామకానికి 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీని కింద నాలుగు సంవత్సరాల స్వల్ప కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైనికుల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ పథకం కింద ఈ ఏడాది మూడు సర్వీసుల్లో దాదాపు 46,000 మంది సైనికులను నియమించనున్నారు. ఎంపిక కోసం అర్హత వయస్సు 17 - 21 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎంపికైన వారికి అగ్నివీర్ అని పిలుస్తారు.
