ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మే 12 వరకు జ్యుడీషీయల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మే 12వ తేదీ వరకు జ్యుడీషీయల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. ఇవాళ్టితో మనీష్ సిసోడియా జ్యుడీషీయల్ రిమాండ్ ముగియనుంది. దీంతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియాను దర్యాప్తు అధికారులు హాజరుపర్చారు. ఈ ఏడాది మే 12 వరకు మనీష్ సిసోడియా జ్యుడీషీయల్ రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఈ పాలసీ రూపకల్పనలో మనీష్ సిసోడియా కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ నెల సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ లో మనీష్ సిసోడియా పేరును దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. మరో వైపు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక దశలో ఉన్నందు న ఈ సమయంలో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ వాదించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ నెల 16న అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
