Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడికి రావాలో చెప్పండి: సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం సవాలు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 13 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. 

Manish Sisodia Reacts after CBI issues look out notice
Author
First Published Aug 21, 2022, 12:21 PM IST

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 13 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియా సహా మొత్తం 14 మంది పేర్లు ఉన్నాయి. తనకు సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేయడంపై.. మనీష్ సిసోడియా స్పందించారు. ‘‘ఇదేంటి డ్రామా’’ అంటూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

తన ఇంట్లో జరిపిన దాడుల్లో ఒక్క పైసా కూడా లభించలేదని సిసోడియా తెలిపారు. అయితే తాను కనిపించడం లేదంటూ లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారని.. ‘‘మోదీ జీ ఏంటి ఈ జిమ్మిక్కు’’ అని ప్రశ్నించారు. తాను ఢిల్లీలో స్వేచ్చగా తిరుగుతున్నానని తెలిపారు. ఎక్కడికి రావాలో చెప్పాలని సిసోడియా సవాల్‌ విసిరారు. ఇక, లుక్ అవుట్ సర్క్యులర్ ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా నిరోధిస్తుంది. అందులో పేర్కొన్న షరతును ఉల్లంఘించినట్లు తేలితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. 

 


ఇక, ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా ఇళ్లుతో పాటు 31 ప్రదేశాలలో శుక్ర‌వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా, ఇతర పబ్లిక్ సర్వెంట్లు 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేకుండా ‘‘టెండర్ తర్వాత లైసెన్సుదారులకు అనుచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో’’ తీసుకున్నారని సీబీఐ ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో,  అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడిన మద్యం వ్యాపారులలో ఒకరైన ఇండోస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు.. సిసోడియా సన్నిహితులకు కోట్లలో కనీసం రెండు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది.

ఇక, ఈ కేసులో నిందితుల్లో కొందరిని సమగ్ర విచారణ కోసం సీబీఐ శనివారం సమన్లు ​​పంపింది. మూలాల ప్రకారం.. సీబీఐ నుంచి సమన్లు ​​పొందిన వారిలో కొందరు మనీష్ సిసోడియాకు సన్నిహితులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. సిసోడియా శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బీజేపీ, మోదీ ప్రభుత్వాలపై మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios