Manipur violence: హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ ప్రజలను వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మే 3వ తేదీ నుంచి కుకీ తెగల నిరసన ర్యాలీ గిరిజనేతర మీటీ కమ్యూనిటీతో ఘర్షణలకు దారితీయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడి.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో మెజారిటీ వర్గానికి చెందిన మైతీ కమ్యూనిటీని చేర్చాలనే డిమాండ్ కు సంబంధించి మార్చ్ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయి.
Manipur violence-Nearly 60 killed: మణిపూర్ లో మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండలో దాదాపు 60 మంది మరణించారనీ, 231 మంది గాయపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. అలాగే, ఆస్తుల నష్టం అధికంగానే ఉందని పేర్కొన్నారు. హింసాత్మక ఘర్షణల క్రమంలో 1,700 ఇళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20 వేల మందిని సురక్షితంగా తరలించామనీ, 10 వేల మంది ఉద్రిక్త పరిస్థితుల మధ్య చిక్కుకుపోయారని తెలిపారు. "మే 3 నుంచి జరిగిన దురదృష్టకర ఘటనలో 60 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 231 మంది గాయపడ్డారు. 1,700 ఇళ్లు దగ్ధమయ్యాయి. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాత్మక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి వారి ప్రాంతాలకు తరలించడం ప్రారంభమైంది" అని ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు.
ఇప్పటి వరకు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 10 వేల మంది చిక్కుకుపోయారు. ఘటన జరిగిన రోజు నుంచి నేటి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన అనేక కంపెనీల కేంద్ర బలగాలను పంపించారని బిరెన్ సింగ్ తెలిపారు. మే 3న కుకి తెగలు నిర్వహించిన నిరసన ర్యాలీ గిరిజనేతర మైతీ కమ్యూనిటీతో ఘర్షణలకు దారితీయడంతో మణిపూర్ లో అశాంతి చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో మెజారిటీ వర్గమైన మైతీ కమ్యూనిటీని చేర్చాలనే డిమాండ్ కు సంబంధించి కేంద్రానికి సిఫార్సు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవల మణిపూర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈ మార్చ్ కు పిలుపునిచ్చారు. తరువాతి రెండు రోజుల్లో, అల్లరి మూకలు కార్లు, భవనాలను తగలబెట్టాయి. దుకాణాలు-హోటళ్లను ధ్వంసం చేశాయి. చురాచంద్ పూర్, ఇంఫాల్ ఈస్ట్ అండ్ వెస్ట్, బిష్ణుపూర్, తెంగ్నౌపాల్, కాంగ్పోక్పి వంటి జిల్లాల్లో చర్చిలను ధ్వంసం చేశాయి.
ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. హింస తీవ్రతరం కావడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేసి, కర్ఫ్యూ విధించడంతో పాటు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు సైతం జారీ చేసింది. మణిపూర్ ఇలా దగ్ధమైనప్పటికీ మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అధికార బీజేపీ, ఆ పార్టీ నేతలు యుద్ధప్రాతిపదికన ప్రచారం చేయడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డ్రోన్లు, సైనిక హెలికాప్టర్ల మోహరింపు వంటి వైమానిక మార్గాల ద్వారా హింసాత్మక ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను గణనీయంగా పెంచినట్లు సైన్యం ఆదివారం తెలిపింది. ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఆదివారం కర్ఫ్యూను సడలించిన తర్వాత ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
