సారాంశం

Manipur violence: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి కేసు దర్యాప్తును సీబీఐ తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. ఇవాళ విచారణ ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సూచన మేరకు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
 

Manipur sexual assault case: మణిపూర్ లో ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి కేసు దర్యాప్తును సీబీఐ తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. ఇవాళ విచారణ ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సూచన మేరకు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. మే 4న మణిపూర్‌లో కుకీ మహిళలను వివస్త్రను చేసి, నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన లైంగిక వేధింపుల కేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేప‌ట్టింది. దర్యాప్తు చేపట్టిన తర్వాత మణిపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను తిరిగి నమోదు చేసినట్లు సంబంధిత‌ అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత జూలై 19న మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలో మే 4న బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం జరగ్గా, ఇద్దరు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించినట్లు మ‌ణిపూర్ రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఈ కేసును సీబీఐకి బదిలీ చేశామనీ, విచారణ కాలపరిమితితో జరగాలనీ, మణిపూర్ వెలుపల జరగాలని పేర్కొంటూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న నేరాలను చాలా హేయమైనవిగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనీ, వాటిని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభావం చూపేలా న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ.. జాతి ఘర్షణలపై రెండు నెలలకు పైగా బహిరంగ మౌనాన్ని వీడుతూ ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. ఇద్దరు మహిళలపై జ‌రిగిన‌ దాడులు క్షమించరానివి అని అన్నారు. అయితే, మే మొదటి వారంలో ఈశాన్య రాష్ట్రాన్ని చుట్టుముట్టిన పెద్ద హింసను ప్ర‌ధాని నేరుగా ప్రస్తావించలేదు. ఈ క్ర‌మంలోనే మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మాట్లాడాల‌నీ, ఆ తర్వాత ఉభయ సభల్లో చర్చించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.