రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మణిపూర్ సర్కార్.. 19 పీఎస్‌లకు మినహాయింపు..
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రాష్ట్రాన్ని ‘‘డిస్టర్డ్బ్ ఏరియా’’ (కల్లోలిత ప్రాంతం)గా ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) కింద ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాజధాని ఇంఫాల్‌తో సహా 19 పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇది 2023 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆరు నెలల పాటు అమలులో ఈ నిర్ణయం అమలులో ఉండనుంది.
‘‘వివిధ తీవ్రవాద/తిరుగుబాటు గ్రూపుల హింసాత్మక కార్యకలాపాలు మొత్తం రాష్ట్రంలో పౌర పరిపాలనకు సహాయంగా సాయుధ బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘‘రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర యంత్రాంగం సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత చెదిరిన ప్రాంతంలో పరిస్థితిపై యథాతథ స్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ప్రభుత్వం తెలిపింది.
ఇక, మినహాయించబడిన 19 పోలీస్ స్టేషన్‌లు.. ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్‌జమీ, సెక్‌మై, లాంసాంగ్, పట్సోయ్, వాంగోయ్, పోరోంపట్, హీంగాంగ్, లామ్‌లై, ఇరిల్‌బంగ్, లీమాఖోంగ్, తౌబల్, బిష్ణుపూర్, నంబోల్, మొయిరాంగ్, కక్చింగ్, జిర్‌బామ్.
ఇక, ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపినందుకు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మంగళవారం విద్యార్థి సంఘాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విద్యార్థుల మృతదేహాల విజువల్స్ ఆన్‌లైన్‌లో రావడంతో మంగళవారం నుంచి మరోమారు నిరసనలు ప్రారంభమయ్యాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం దాదాపు ఐదు నెలల నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామాం చోటుచేసుకుంది. విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోషల్ మీడియాలో వెలువడటంతో.. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే నిరసనకారులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో కనీసం 45 మంది నిరసనకారులు గాయపడ్డారు. ఇక, తాజా నిరసనల నేపథ్యంలో వచ్చే ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం నిషేధం విధించింది.