Imphal: ఇంఫాల్ లో మణిపూర్ మంత్రి అధికారిక నివాసానికి నిప్పుపెట్టారు. ఇంఫాల్ వెస్ట్ లోని మణిపూర్ క్యాబినెట్ మినిస్టర్, బీజేపీ నాయకురాలు నెంచా కిప్జెన్ అధికారిక నివాసానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
fresh violence in Manipur: ఇంఫాల్ లో మణిపూర్ మంత్రి అధికారిక నివాసానికి నిప్పుపెట్టారు. ఇంఫాల్ వెస్ట్ లోని మణిపూర్ క్యాబినెట్ మినిస్టర్, బీజేపీ నాయకురాలు నెంచా కిప్జెన్ అధికారిక నివాసానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకెళ్తే... మణిపూర్ సోషల్ మీడియా వెల్ఫేర్ మంత్రి, బీజేపీ నేత నెమ్చా కిప్జెన్ అధికారిక నివాసాన్ని దుండగులు తగలబెట్టారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే, మణిపూర్ లో హింస నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి నెమ్చా కిప్జెన్. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కంగ్‌పోక్పి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన కిప్జెన్ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. ఈ బంగ్లా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో ఉంది.
గత ఏడాది ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కిప్జెన్.. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ నాయకత్వంలోని 12 మంది సభ్యుల మంత్రివర్గంలో ఏకైక మహిళ మంత్రి. ఆమె మొదటి బీరెన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. ప్రత్యేక పరిపాలన కోసం డిమాండ్‌ను లేవనెత్తిన, బీజేపీతో అనుబంధంగా ఉన్న పది మంది కుకీ ఎమ్మెల్యేలలో ఆమె ఒకరు.
మణిపూర్ లో మళ్లీ హింస..
మణిపూర్ లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని ఖమెన్‌లోక్ ప్రాంతంలోని ఒక గ్రామంలో మంగళవారం దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా , మరో పది మంది గాయపడ్డారు. గ్రామంలో దుండగులు కాల్పులు జరిపి దహన దాడులకు పాల్పడ్డారు. నివేదికల ప్రకారం, ఖమెన్‌లోక్ గ్రామంలో దుండగులు అనేక ఇళ్లను తగలబెట్టారు. తమెంగ్‌లాంగ్ జిల్లా గోబజాంగ్‌లో అనేక మంది గాయపడ్డారు.
హింసాత్మక ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతా సిబ్బంది హైరిస్క్ ప్రాంతాల్లో గస్తీ కొనసాగిస్తున్నారు. గత 24 గంటల్లో తెంగ్నూపాల్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో భారీగా తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 1,040 ఆయుధాలు, 13,601 మందుగుండు సామాగ్రి, 230 రకాల బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, జిల్లా అధికారులు ఇంఫాల్ తూర్పు జిల్లా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో సాధారణ ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వేళలను ఉదయం 5 నుండి 9 గంటల వరకు కుదించారు. మణిపూర్‌లోని 16 జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు వుండగా, 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. మొత్తం ఈశాన్య రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.
