మణిపూర్ లో ఈ సారి మళ్లీ బీజేపీ అధికారం చేపట్టనుందని జీ న్యూస్-డిజైన్‌బాక్స్డ్ , ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గత ఎన్నికల్లో కాంగ్రస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సంస్థల ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేశాయి.
మణిపూర్ (manipur) లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని రెండు ప్రముఖ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 28వ తేదీన చేపట్టగా, రెండో దశ ఎన్నికలు మార్చి 5వ తేదీన జరిగాయి. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో ఈ సారి అధిక స్థానాలు బీజేపీ (bjp) గెలుచుకుంటుందని రెండు మీడియా సంస్థలు వెల్లడించాయి.
జీ న్యూస్-డిజైన్‌బాక్స్డ్ (Zee News-Designboxed) చేపట్టిన సర్వేలో బీజేపీ (bjp)కి 32-38 సీట్లు, కాంగ్రెస్ (congress)కు 12-17 సీట్లు వస్తాయని తేలింది. ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో రీసెర్చ్ (India TV-Ground Zero Research) ప్రకారం బీజేపీకి 26-31 సీట్లు, కాంగ్రెస్‌కు 12-17 సీట్లు వస్తాయని తెలిపాయి. ఈ సారి కూడా బీజేపీ అధికారం చేపట్టనుందని చెప్పాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలోకి వెల్లిపోనుందని పేర్కొన్నాయి.
2017 మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో బీజేపీ 21 సీట్లు గెలుచుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF), చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (LJP) ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం ఓట్లలో బీజేపీకి 36.28 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 35.11 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. బీరెన్ సింగ్ నాయకత్వంలో ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎల్ జేపీలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగానే పోటీగానే ఎలాంటి పొత్తులు లేకుండా రంగంలోకి దిగింది. కాగా మరోవైపు కాంగ్రెస్ (Congress) ఆరు రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసింది. దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) అని పేరు పెట్టింది. MPSAలో సంకీర్ణ భాగస్వాములలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), జనతాదళ్ (సెక్యులర్) ఉన్నాయి.
ఈ సారి మణిపూర్ లో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగింది. బీజేపీ ఈ సారి ఒంటరిగానే అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో తీవ్ర ప్రయత్నం చేసింది. అలాగే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమి కూడా ప్రచారంలో దూసుకుపోయింది. ఈ రాష్ట్రంలో ఎన్ సీపీ (NCP) కూడా బరిలో నిలిచింది. ఢిల్లీలో మూడు వరుసగా మూడో సారి అధికారం చేపట్టి మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) కూడా మణిపూర్ లో పోటీ చేసింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (AAP chief arvind kejriwal) ఎన్నికల నేపథ్యంలో అనేక సార్లు మణిపూర్ లో పర్యటించారు.
