60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి రెండు స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈ సారి కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవనుందని పేర్కొంది.
Manipur Election News 2022 : గత రెండు నెలల నుంచి ఎంతో ఉత్కంఠను రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు నేటితో ముగిశాయి. ఉత్తరప్రదేశ్ లో నేడు ఏడో దశ ఎన్నికలు పూర్తవడంతో దాదాపు ఈ మినీ సంగ్రామం ముగిసినట్లైంది. అయితే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్నంత సేపు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ముందే ప్రకటింది. సోమవారంతో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్స్ పోల్స్ విడుదలవుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. అయితే మణిపూర్ లో ఎవరు అధికారం చేపడుతారనే విషయంలో పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. దీని ప్రకారం ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ముఖ్యమైన పోటీ నెలకొందని తెలిపింది. అయితే కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, మళ్లీ బీరేన్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారం చేపట్టనుందని అంచనా వేసింది. ఈ సారి బీజేపీ 25 నుంచి 31 సీట్లు గెలుస్తుందని అంచానా వేసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో నిలవనుందని తెలిపింది. ఇక్కడ ఆ పార్టీ 17 నుంచి 21 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది.
దీంతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 7-11 స్థానాలు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) 3-5, వివిధ పార్టీలు, ఇండిపెంట్లు కలిపి 2 స్థానాలు గెలుచుకోవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్ కు 29 శాతం వరకు ఓట్లు పోలయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో బీరెన్ సింగ్ సీఎంగా ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే సీఎం అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్నది తెలియాలంటే మార్చి 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది.
