ఇంపాల్: అతడు అత్యాచారం,హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఇటీవల అతడికి యువతిపై అత్యాచారం, హత్యతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. అయితే అప్పటికే అతడి జీవితంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అన్యాయంగా జైలుపాలయిన యువకుడికి స్వయంగా ముఖ్యమంత్రే అండగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... మణిపూర్ రాష్ట్రానికి చెందిన తౌడమ్ జిబల్ సింగ్ పిహెచ్‌డి చేస్తుండగా ఓ యువతి అత్యాచారం,హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఇతడే యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అతడు దాదాపు ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. 

అయితే ఇటీవలే అతడిని నిర్దోషిగా తేల్చిన న్యాయస్థానం విడుదల చేసింది. చేయని నేరానికి శిక్ష అనుభవించిన జిబల్ సింగ్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అండగా నిలిచారు. అతడికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. పాథాలజీ విభాగానికి చెందిన జిబల్ సింగ్ ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటు అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని సీఎం హామి ఇచ్చారు.