Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్ వార్‌ రూమ్‌లో సోదాలు.. లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ ‌వాయిదా తీర్మానం..

హైదరాబాద్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కమ్ సోషల్ మీడియా కార్యాలయంపై మంగళవారం పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

Manickam Tagore gave adjournment motion notice in Lok Sabha to discuss searches telangana congress war room
Author
First Published Dec 14, 2022, 11:11 AM IST

హైదరాబాద్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కమ్ సోషల్ మీడియా కార్యాలయంపై మంగళవారం పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.  తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్ట్‌లు పెట్టినందుకు కొందరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌లోకి ప్రవేశించి ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసుల దౌర్జన్య వైఖరిపై చర్చించాలని కోరారు. కేసీఆర్ దక్షిణ  భారత హిట్లర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

‘‘హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసుల దారుణమైన వైఖరిపై చర్చించాలి. సెర్చ్ వారెంట్ లేకుండా లేదా సీఆర్‌పీసీ 41 ఏ కింద ఎలాంటి నోటీసు లేకుండా.. తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా ఎఫ్‌బీ పోస్ట్ ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిరంకుశ స్వభావంతో వ్యవహరిస్తుంది. దక్షిణ భారత హిట్లర్‌గా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఇటువంటి కార్యకలాపాలను ఆపాలని కూడా సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి’’ అని మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసులో కోరారు. 

మరోవైపు సునీల్‌ కనుగోలు బృందం నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేసి 50 కంప్యూటర్లు, డేటాను దొంగిలించారని మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్ లేకుండా మా ఐదుగురు ప్రొఫెషనల్ పార్టనర్‌లను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఇప్పుడు తాను కూడా అదే అదే పోస్టు చేస్తున్నానని.. తెలంగాణ ముఖ్యమంత్రి తనను కూడా అరెస్ట్ చేయాలని సవాలు చేశారు. 

ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న సనాలీ స్పాజియో భవనంలోని ఫోర్త్ ఫ్లోర్‌కు చేరుకున్న పోలీసులు.. అర్థరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కించపరిచేలా పోస్టింగ్స్ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. 

‘‘నిందితులు ఐపీ మాస్కింగ్ టూల్స్‌ను ఉపయోగించినందున వారికి గుర్తించేందుకు మా సిబ్బందికి చాలా సమయం పట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుర్భాషలాడడం, పరువు నష్టం కలిగించే, అవమానకరమైన పోస్టులు ఫేక్ ప్రొఫైల్‌ల ద్వారా అప్‌లోడ్ చేయబడుతున్నాయి. ఈ కార్యాలయం నుంచే అది జరిగినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి’’ అని ఏసీపీ చెప్పారు. ముగ్గురు సిబ్బంది వద్ద ఉన్న కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టులకు సంబంధించి ఏసీపీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ముగ్గురు అనుమానితులను కార్యాలయం నుంచి విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇక, ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నోటీసులు చూపించాలని  పోలీసులను నిలదీశారు. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్‌పై పోలీసుల చర్యను ఖండిస్తూ బుధవారం అన్ని మండలాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని, పోలీసు కమిషనరేట్ ఎదుట భారీ ధర్నాకు దిగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios