స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న కర్నాటక మాండ్యా నియోజకవర్గ ఎంపీ సుమలత తన పూర్తి మద్ధతును బీజేపీకి ప్రకటించారు. 

కర్ణాటక : కర్ణాటక ఎంపీ, మాజీ నటి సుమలత అంబరీష్ (59) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గత నాలుగేళ్ల నుంచి మాండ్యా లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సుమలత హఠాత్తుగా కేంద్రంలోని బిజెపికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఇది కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మోడీ ప్రభుత్వానికి ఆమె తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ.. మోడీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా దేశానికి లభించిన ఖ్యాతి, దేశంలో నెలకొన్న సుస్థిరతలను దృష్టిలో పెట్టుకొని తను ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిపారు. 

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా స్వతంత్రంగా వ్యవహరించాను. కానీ బహిరంగ సమావేశంలో పాల్గొనడం వంటి విషయాల్లో ఈ నాలుగేళ్లలో అనేక సవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మద్దతు అవసరమని భావించాను. అందుకే నా పూర్తి మద్దతును కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఇస్తున్నాను’ అని ఆమె మీడియాతో తెలిపారు. నటిగా.. తెలుగు కన్నడ సినిమాల్లో ప్రేక్షకుల అభిమానాన్ని చురకొన్న సుమలత.. కన్నడ నటుడు అంబరీష్ ను వివాహమాడారు. 

కర్ణాటక ఎన్నికల వేళ సుమలత సంచలన నిర్ణయం..

కొద్ది కాలం క్రితం అంబరీష్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సుమలత బహుభాషా నటి. సుమారు 220కి పైగా వివిధ భాషా సినిమాల్లో నటించారు. 2019లో కర్ణాటక ఎలక్షన్స్ లో మాండ్యా నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచారు. గత నెలలో ఆమె బిజెపిలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో సుమలత ఆ వార్తలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి తన మద్దతు ఉండబోదని ప్రకటించారు.