ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పది పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. ఆస్తి కోసం అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీ జిల్లాకు చెందిన 52 ఏళ్ల జగన్‌లాల్‌ యాదవ్‌ అనే రైతు 1990నుంచి మొదలుకుని ఇప్పటివరకు మొత్తం 10 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 

పదిమంది భార్యల్లో ఐదుగురు చనిపోగా.. ముగ్గురు వేరే వారితో లేచిపోయారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో ఉంటున్నాడు. బుధవారం ఊరికి దగ్గరలోని పంట పొలంలో జగన్‌లాల్‌ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే అతడ్ని చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

భోజిపుర స్టేషన్‌ హౌస్‌ అధికారి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ‘‘ హతుడికి మేయిన్‌ రోడ్డు పక్కన స్థలం ఉంది. దానికి మార్కెట్‌లో చాలా విలువ ఉంది. దాని కోసమే అతడ్ని హత్య చేసి ఉంటారు. ఓ పెళ్లి తర్వాత మరో పెళ్లి ఇలా చాలా సార్లు పెళ్లి చేసుకున్నాడు. కానీ, అతడికి పిల్లలు లేరు. భార్య మొదటి భర్తకు పుట్టిన కుమారుడితో ఉంటున్నాడు. పలుమార్లు పెళ్లి చేసుకున్న కారణంగా జగన్‌లాల్‌ తండ్రి.. ఆస్తిని అతడి అన్నకు రాశాడు. జగన్‌లాల్‌ పంచాయితీలో గెలిచి కొంత భూమిని దక్కించుకున్నాడు. బంధువులందరి స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం. బంధువులే ఈ హత్య చేసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది’’ అని అన్నారు.