అస్సాం జెఈఈ మెయిన్స్ లో స్కాంలో గౌహతి పోలీసులు మరొకరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. జెఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన వ్యక్తికి బదులు పరీక్షకు హాజరైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ పోలీస్ అధికారి లాల్ బురా నేతృత్వంలోని బృందం ఆదివారం ప్రదీప్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన ఎనిమిదవ నిందితుడు ఇతను. 

వివరాల్లోకి వెడితే.. జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన నీల్ నక్షత్ర దాస్ తన స్నేహితుడుతో జరిపిన ఫోన్ కాల్ బైటికి రావడంతో స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. మెయిన్స్ లో తనకు బదులు వేరే వ్యక్తి పరీక్ష రాశాడని, దీనికోసం తన తల్లిదండ్రులు డబ్బులు పెట్టారని మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.

దీనిమీద దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక పోలీస్ బృందం నగరంలోని గ్లోబల్ ఎడు లైట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని భార్గవ్ దేకాను నవంబర్ 1న అరెస్టు చేశారు. ఈ కేసులు టాపర్ వచ్చిన నీల్ నక్షత్ర దాస్ ను సెప్టెంబర్ 5 న అరెస్ట్ చేశారు. అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయ్ దాస్, కోచింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన మహిళా ఉద్యోగితో పాటు మరో ముగ్గురు నిందితులుగా తేల్చారు. 

ఈ కేసులో మహిళా ఉద్యోగిని అక్టోబర్ 31 న, మరో ఐదుగురిని అక్టోబర్ 28 న అరెస్టు చేశారు. కాగా, నీల్ నక్షత్రదాస్ బెయిల్ మీద బైటికి వచ్చాడు. 

ఇదే సమయంలో జేఈఈ మెయిన్స్ లో స్కాం జరిగిందంటూ అక్టోబర్ 23న మిత్రదేవ్ శర్మ అనే వ్యక్తి అజారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నీల్ పరీక్షకు హాజరు కాలేదని అతని స్థానంలో వేరే వ్యక్తి పరీక్ష రాశాడని ఫిర్యాదులో తెలిపాడు.  

బోర్జర్ ఏరియాలోని ఎగ్జామ్ హాల్ లోకి నీల్ వచ్చాడు కానీ అక్కడ బయోమెట్రిక్ తరువాత బైటికి వెళ్లిపోగా.. అతని స్థానంలో వేరే వ్యక్తి పరీక్ష రాశాడని, డాక్టర్లైన నీల్ తల్లిదండ్రులు దీనికోసం రూ. 15- 20 లక్షలు ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమానికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.