కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయింది. నిండా 16ఏళ్లు నిండని కుమార్తె ప్రాణాలు చేతిలో పోవడంతో... ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కనీసం కూతురిని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి కూడా ఎలాంటి సదుపాయం లేని ప్రాంతం అది. ఈ నేపథ్యంలో.. కన్న కూతురి మృతదేహాన్ని మంచంపై పడుకోపెట్టి.. ఆ మంచాన్ని మోస్తూ పోస్టుమార్టం నిమిత్తం దాదాపు 35 కిలోమీటర్లు నడుకుంటూ వెళ్లాడు. దానిని కొందరు వీడియో తీయగా... అది కాస్త సోషల్ మీడియాలో మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగరౌలి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని కారణాలతో.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో.. వారు అక్కడకు చేరుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్టు మార్టం చేయాల్సిందేనని.. ఆ రిపోర్టు తమకు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.

 

దీంతో.. 35కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి కూతురు శవాన్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది. తీసుకువెళ్లేందుకు సదుపాయం లేకపోవడంతో.. మంచంపై పడుకోపెట్టి.. దానిని మోస్తూ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. దాదాపు 7 గంటల పాటు ఆయన అలా కూతురి శవాన్ని మోయడం గమనార్హం. కాగా... దీనికి సంబంధించిన  వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

అయితే.. వారికున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో.. వాహనం మాట్లాడుకోలేకపోయారని.. అందుకే అలా మంచం మీద తీసుకువెళ్లాల్సి వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు.  ఉదయం 9గంటలకు మొదలైతే.. హాస్పిటల్ కి చేరేసరికి సాయంత్రం 4 గంటలు అయ్యిందని వారు పేర్కొన్నారు.