ప్రేమించిన బాలికతో తనకు పెళ్లి చేయాలంటూ ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌లో నానా రచ్చ చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు .

వివరాల్లోకి వెళితే.. ఒరిస్సాలో రాజధాని భువనేశ్వర్‌‌లోని గజపతి నగర్‌కు చెందిన అజయ్‌ దొర అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ (16) బాలికను ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు ఆమెను రాజస్తాన్‌లోని బంధువుల ఇంటికి పంపేశారు. 

దీనిని ఏమాత్రం ఊహించని అజయ్.. ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అతను బ్యాగులో పెట్రోల్‌ బాటిల్‌ తీసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.

తన ప్రేయసితో పెళ్లి చేయాలని పోలీసులను కోరాడు. అంతా విన్న పోలీసులు మైనర్‌తో వివాహం కుదరదని తేల్చిచెప్పాడు. దీనిపై తీవ్ర అసహనానికి గురైన అజయ్ బ్యాగులోని పెట్రోల్‌ బాటిల్‌ తీసి పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. అనంతరం అగ్గిపెట్టె తీసుకుని అంటించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్‌ చేశారు.