స్మశాన స్థలాన్ని రక్షించుకోలేక పోతున్నానన్న బాధతో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

స్మశాన స్థలాన్ని కబ్జాదారులనుంచి రక్షించుకోలేక.. ఎటూ పాలుపోక ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రయత్నించాడు. బాధితుడు తెలిపి వివరాల ప్రకారం.. కాన్పూర్‌ దేహత్‌, మూసా నగర్‌కు చెందిన గుల్ఫమ్‌(35) ఊర్లోని శ్మశాన వాటిక స్థలానికి కాపలాగా ఉంటున్నాడు. 

అయితే కొందరు కబ్జాదారులు ఆ స్మశాన స్థలాన్ని కూడా వదలిపెట్టలేదు. అక్రమంగా ఆక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టారు. గుల్ఫమ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా లాభం లేకపోయింది. అక్రమార్కులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. 

దీంతో భార్య, బిడ్డలతో కలిసి చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడు. గురువారం ఉదయం కుటుంబసభ్యులను తీసుకుని నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు. ఆ తరువాత తనమీద, తన కుటుంబ సభ్యలు మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 

మంటలకు వారందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు. ఈ  అరుపులు విన్నదారినపోయేవారు వెంటనే పరిగెత్తుకొచ్చి వారి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.