జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంటిలోకి ఓ కారు దూసుకెళ్లబోయింది. కానీ, సెక్యూరిటీ గార్డులు ఆ కారును నడుపుతున్న వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తన బాడీలో కొందరు చిప్ పెట్టారని, బయటి వారే తనను కంట్రోల్ చేస్తున్నారని పోలీసు విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. కాగా, ఆయన మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(NSA Ajit Doval) నివాసంలో భద్రతా లోపం (Security Breach) ఏర్పడింది. ఓ దుండగుడు కారు నడుపుకుంటూ ఏకంగా అజిత్ దోవల్ ఇంటిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డులు వెంటనే అప్రమత్తమై ఆ దుండగుడును అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితుడు అద్దె కారును నడుపుతున్నట్టు తేలిందని పోలీసులు వివరించారు. అంతేకాదు, కొందరు తన బాడీలో చిప్‌ను పెట్టారని నిందితుడు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. బయటి వారే ఆ చిప్ ద్వారా తనను కంట్రోల్ చేస్తున్నట్టు తెలిపాడని వివరించారు. రిమోట్ ద్వారా తనను కంట్రోల్ చేస్తున్నట్టు చెప్పాడని పేర్కొన్నారు. అయితే, ఆ నిందితుడికి ఎంఆర్ఐ స్కాన్ చేశారని, ఆయన బాడీలో ఎలాంటి చిప్ లేదని ఆ స్కాన్‌లో తేలినట్టు తెలిపారు. అయితే, ఆ నిందితుడి మానసిక స్థితి స్థిమితంగా లేన్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. ఆ నిందితుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.
నిందితుడు బెంగుళూరుకు చెందిన శాంతాను రెడ్డి అని తేలిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు స్పెషల్ యాంటీ టెర్రర్ యూనిట్ ఈ వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.
ఈ రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆ కారు అజిత్ దోవల్ నివాసంలోకి దూసుకెళ్లబోయింది. అజిత్ దోవల్ నివాసానికి భద్రతగా ఉన్న సీఐఎస్ఎఫ్ వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అజిత్ దోవల్ ఇంటిలోనే ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా, జనవరి నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పంజాబ్‌లో భద్రతా వైఫల్యం ఎదురుకావడంతో సుమారు 20 నిమిషాలు ఓ ఫ్లై ఓవర్‌పైనే కారులో ఉండిపోవాల్సి వచ్చింది. పంజాబ్ దేశ సరిహద్దు రాష్ట్రమన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో ఈ రాష్ట్ర సరిహద్దు పంచుకుంటున్నది. ఇదిలా ఉండగా, తాజాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అక్కడ భద్రతా లోపం ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాహుల్ గాంధీ నిన్న పంజాబ్ సీఎం ఫేస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నిన్న లూధియానాకు వెళ్లారు. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్‌గా రాహుల్ గాంధీ ప్రకటించడానికి ముందు ఆయన లూధియానా చేరుకుని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సీఎం చరణ్ జిత్ సింగ్, ప్రస్తుత పంజాబ్ ప్రదేశ్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూలతో కలిసి కారులో ప్రయాణించారు. సునీల్ జాఖర్ కారు నడుపుతూ ఉంటే.. వెనక సీట్లలో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూలు కూర్చుని ఉండగా.. ముందు సీట్లో రాహుల్ గాంధీ కూర్చుని ఉన్నారు. వారి కాన్వాయ్ లూధియానాలో నిర్వహించాల్సిన ర్యాలీ వద్దకు వెళ్తుండగా అనుకోని ఘటన జరిగింది.
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు స్వాగతం పడుతున్నట్టుగా కొందరు నిలుచుని ఉన్నారు. ఆ గుంపులోని కొందరు రాహుల్ గాంధీ కారు రాగానే ఓ జెండాను ఆ కారుపైకి విసిరేశారు. ప్రజలకు అభివాదం చెప్పడానికి కారు విండో ఓపెన్ చేసి పెట్టుకోవడంతో ఆ జెండా నేరుగా రాహుల్ గాంధీకి తగిలింది. ఆ జెండా రాహుల్ ముఖానికి తగిలి ఉండే అవకాశం ఉన్నట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. అదే గుంపు దగ్గర కొందరు పోలీసులు కూడా కనిపించారు. కానీ, వారు అంతగా అప్రమత్తంగా లేనట్టు కనిపించారు. కారుపై జెండా విసిరేసినా.. ఆ పోలీసులు మెల్లిగా నడుస్తూ వస్తున్నట్టు వీడియోలో కనిపించారు. అయితే, జెండా విసిరేసిన వ్యక్తిని పట్టుకున్నట్టు సమాచారం. కానీ ఆ తర్వాతే వెంటనే వదిలిపెట్టినట్టు తెలిసింది.
