ముంబై: బావను చంపాలని ఉత్తరప్రదేశ్ నుంచి ముంబై వచ్చిన ఓ 32 ఏళ్ల వ్యక్తి తనను తాను కాల్చుకుని మరణించాడు. ముంబైలోని సబర్బన్ కందివలిలోని తన సోదరి ఇంట్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన బావను చంపడంలో విఫలమై అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన బతుకేశ్వర్ త్రిలోక్ తివారీ అనే వ్యక్తి ముంబైలోని తన సోదరి వందన (20), బావ రోహిత్ (27)లను చూడడానికి వచ్చాడు. మద్యం మత్తులో బతుకేశ్వర్ త్రిలోక్ తివారీ తన బావపై కాల్పులు జరిపాడు. దాని నుంచి బావ తప్పించుకున్నాడు.

వెంటనే రోహిత్, చందన భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత బతుకేశ్వర్ త్రిలోక్ తివారీ అపార్టుమెంటులో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది.

కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా చందన రోహిత్ ను వివాహం చేసుకుంది. సోమవారం సాయంత్రం బతుకేశ్వర్ చెల్లె ఇంటికి వచ్చి మద్యం సేవించాడు, భోజనం కూడా చేశాడు. ఆ తర్వాత బావను చంపడానికి ప్రయత్నించాడు. 

అతని నుంచి తప్పించుకుని రోహిత్, చందన బయటకు పరుగులు తీసిన తర్వాత బతుకేశ్వర్ డోర్ లాక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతనికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.