బీహార్ లో అమానుషం జరిగింది. మహిళలపై వరుస దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తి ఆమె నిరాకరించడంతో ఆమె మూడు నెలల పసికందును మంటల్లోకి విసిరేశాడు. 

ఆదివారం ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మంటల్లో పడిన చిన్నారి కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ చిన్నారికి సదర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

బీహార్ లోని బొచ్చన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. చలి కాచుకోవడానికి మహిళ తన ఇంటి బయట మంట వేసుకుని, పాపనెత్తుకుని కూర్చుంది. అయితే  చలిమంట దగ్గర ఆమె పక్కనే కూర్చున్న నిందితుడు లైంగిక వేధింపులకు దిగాడు. 

అతడి చేష్టలు మితిమించుతుండడంతో బాధితురాలు అడ్డుకుంది. దీంతో నిందితుడు కోపంతో ఊగిపోయాడు. తననే కాదంటావా అంటూ మహిళ ఒళ్లోని చిన్నారిని బలవంతంగా లాక్కుని మంటల్లోకి విసిరేశాడు. వెంటనే తల్లి తేరుకుని చిన్నారిని మంటల్లో నుంచి లాగింది. అయితే అప్పటికే చిన్నారికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మొదట పోలీసులు ఒప్పుకోలేదని బాధితురాలి భర్త ఆరోపించాడు. 

దీంతో తాము సీనియర్ సూరింటెండెంట్ జయంత్ కాంత్ ను కలిశాకనే కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్యభర్తలు డిమాండ్ చేశారు.