థానేలో ఈ శనివారం ఓ షాకింగ్ ఘటన జరిగింది. పొరుగింటి పిల్లల్ని ఓ వ్యక్తి బిల్డింగ్ మీదినుంచి కిందికి తోసేశాడు. దీంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన పక్కింటివాళ్ల ఐదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురిని భవనం రెండో అంతస్థుపై నుంచి తోసేశాడు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా, బాలిక తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

ఈ సంఘటన శనివారం ముంబ్రా టౌన్‌షిప్‌లోని దేవ్రిపాడ ప్రాంతంలో జరిగింది. అయితే, ఇలా చేయడం వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదని.. దీనికోసం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. పిల్లల్ని తోసేసిన నిందితుడిని ఆసిఫ్‌గా గుర్తించారు. అతడిని సోమవారం అరెస్టు చేసినట్లు ముంబ్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఆసిఫ్ కు పెళ్లయ్యింది. బాధితుల పక్క ప్లాట్ లోనే ఉంటున్నారు. అయితే, వీరికి పిల్లలు లేరు. నిందితుడు, అతని భార్య మధ్య చిన్నచిన్న విషయాలపై తరచూ గొడవలు జరిగేవి. నిందితుడి భార్య బాధిత చిన్నారుల తల్లికి స్నేహితురాలు. పక్క పక్క ఇండ్లు కావడంతో వారు తరచూ మాట్లాడుకునేవారని, అది నిందితుడికి ఇష్టం లేదని అధికారి తెలిపారు.

‘నా భార్యకు భరణం ఇవ్వాలి.. కిడ్నీ అమ్మేస్తా కొనండి.. లేదంటే ఆత్మాహుతి కార్యక్రమమే...’

శనివారం నిందితుడు ఇద్దరు చిన్నారులు భవనంలోని రెండో అంతస్తులో ఆడుకుంటుండగా.. అక్కడినుంచి వారిని కిందికి తోసేశాడని తెలిపారు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగే అక్కడినుంచి లేచిన చిన్నారి.. తన ఇంటికి వెళ్లి... జరిగిన విషయం తెలిపింది. 

అన్నను, తనను పక్కింటి అంకుల్ బిల్డింగ్ మీదినుంచి తోసేశాడని తన తండ్రికి తెలియజేసినట్లు అధికారి తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన తండ్రి, అపార్ట్ మెంట్ వాసులు నిందితుడిని పట్టుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మొదట మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పిల్లల తల్లి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు.