మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్న సభలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణంగా.. ఏడాది వయసు గల ఒక చిన్నారిని తల్లిదండ్రులు వేదిక వైపు తోసేయడమే.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్న సభలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణంగా.. ఏడాది వయసు గల ఒక చిన్నారిని తండ్రి వేదిక వైపు తోసేయడమే. అయితే చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అతడు ఈ పని చేసినట్టుగా తేలింది. వివరాలు.. సాగర్‌లోని కేస్లీ తహసీల్‌లోని సహజ్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న ముఖేష్ పటేల్ వృత్తిరీత్యా కూలీగా ఉన్నాడు. ముఖేష్ తన భార్య నేహా, వారి ఒక సంవత్సరం కొడుకుతో నివసిస్తున్నాడు.
అయితే ముఖేష్ కొడుకుకు 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. పెద్దగా స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. తదుపరి వైద్యాని అయ్యే ఖర్చు భరించే స్థోమత లేకపోవడంతో పలువురి సాయం కోరుతున్నాడు. ఈ క్రమంలోనే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సాగర్‌లో నిర్వహించిన కుష్వాహ సమాజ్ మహా సదస్సు, సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ముఖేష్, నేహా దంపతులు ఆయనను కలవాలని ప్రయత్నించారు.
అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సీఎంను కలవాలని.. తమ సమస్య చెప్పుకోవాలని వారు భావించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో.. ముఖేష్ అతడి బిడ్డను వేదిక వైపుకు విసిరేశాడు. జనంలో నుంచి చిన్నారి సీఎం వేదికకు సమీపంలో పడిపోయాడు. అయితే ఈ ఘటనలో బాలుడు క్షేమంగా ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై సీఎం శివరాజ్ చౌహాన్ స్పందించారు.
ఈ క్రమంలోనే ముఖేష్ తన కుమారుడికి గుండెలో రంధ్రం ఉందని.. చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని, అందుకు అయ్యే ఖర్చు భరించే స్థోమత తమకు లేదని సంఘటన స్థలంలో ఉన్న అధికారులకు చెప్పాడు. ఆ సందేశం సీఎం వద్దకు చేరగా.. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అతడిని సీఎం నివాసానికి పంపాలని కలెక్టర్ దీపక్ ఆర్యను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.
ఈ ఘటనకు సంబంధించి ముఖేష్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. అంతగా స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ‘‘మా బిడ్డకు ఇప్పుడు ఏడాది వయస్సు. డాక్టర్ సర్జరీ చేయించాలని చెప్పారు. వైద్యులు ఇంకా రూ. 3.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం మాకు సాధ్యం కాదు. మా బిడ్డకు వైద్యం చేయించాలని కోరుతున్నాం. కానీ ఎవరూ మాకు సహాయం చేయడం లేదు’’ అని ముఖేష్ చెప్పారు. ప్రభుత్వం నుంచి కొంత సహాయం పొందాలని తాను ఆశిస్తున్నానని తెలిపారు.
అయితే తాము ముఖ్యమంత్రిని కలవడానికి కూడా అధికారులు అనుమతించలేదని తెలిపారు. అయితే తమ బాధను సీఎంతో చెప్పుకోవాలని అనుకున్నామని.. అందుకే తమ బిడ్డను వేదికపైకి విసిరామని చెప్పారు. ఇప్పుడు అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారని తెలిపారు.
