కూతురిని ఎందుకు ఏడిపిస్తున్నారని అడగటానికి వెళ్లిన తండ్రిని ఆకతాయిలు దారుణంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని మోతీనగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తెతో కలిసి ఆస్పత్రి నుంచి మోటార్ సైకిలుపై ఇంటికి వెళుతున్నాడు.

ఆ సమయంలో ఓ యువకుడు అతని కుమార్తెను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన తన కూతురిని ఇంటి దగ్గర వదిలిపెట్టి కామెంట్ చేసిన వ్యక్తి గురించి అతని తల్లిదండ్రులకు చెప్పడానికి వెళ్లాడు.

ఈ విషయాన్ని సదరు యువతి తన సోదరుడికి చెప్పడంతో వ్యాపారవేత్త కుమారుడు కూడా పోకిరి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన తండ్రికి, నిందితులకు మధ్య గొడవ జరుగుతుండటాన్ని కుమారుడు గమనించాడు. నాన్నకు మద్ధతుగా కుమారుడు కూడా ఆకతాయిలతో గొడవకు దిగాడు.

మాట మాట పెరిగి చివరికి ఆగ్రహంలో పోకిరిలు వారిపై దాడికి దిగారు. దీంతో ఆకతాయి, అతని తండ్రితో పాటు మరో ఇద్దరు సోదరులు కలిసి వ్యాపారవేత్త, అతని కుమారుడిపై దాడికి దిగారు. నిందితుల ఇంటికి వెళ్లిన వారు ఇంకా రాకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త భార్య పోకిరి ఇంటికి చేరుకున్నారు.

అక్కడ కత్తి పోట్లకు గురైన భర్త, కొడుకు ఆమెకు కనిపించారు. ఆందోళనకు గురైన ఆమె స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారవేత్త మరణించగా, అతని కుమారుని పరిస్ధితి విషమంగా ఉంది.

బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. నిందితునికి సహకరించిన ఇద్దరు సోదరులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.