ఈశాన్య ఢిల్లీలో ఇద్దరు సోదరులపై పొరుగునే ఉండే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నిందితుడు పారిపోగా.. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరు వేరే మతాలకు చెందినవారు కావడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ఏరియాలో మోహరించాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. రాత్రిపూట డిన్నర్ చేశాక ఐస్ క్రీం తినడానికి రోడ్డు పైకి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములను పొరుగునే ఉండే వ్యక్తి కత్తితో పొడిచేశాడు. పొత్తి కడుపులో పొడవగానే పక్కనే ఉన్న సోదరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనకూ గాయాలయ్యాయి. దుండగుడు వెంటనే అక్కడే ఓ చోట దాక్కున్నాడు. దాడి చేసిన వ్యక్తి, బాధితులు వేరే మతాలకు చెందినవారు కావడంతో ఆ ఏరియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అదే ఏరియాలో 2020లో అల్లర్లు కూడా జరిగిన అనుభవం ఉండటంతో పారామిలిటరీ బలగాలు వెంటనే మోహరించాయి.
ఈశాన్య ఢిల్లీలోని బ్రిజ్‌పురి ఏరియాలో నివసించే రాహుల్, కజిన్ బ్రదర్ సోను ఇద్దరూ భోజనం చేసిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఐస్ క్రీం కోసం బయటకు వెళ్లారు. పొరుగునే ఉండే మొహమ్మద్ జైద్‌తో రోడ్డుపై వాగ్వాదం జరిగింది. జైద్ వెంటనే కత్తి తీసి రాహుల్ పొత్తి కడుపులో పొడిచేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోనుపైనా దాడి చేయడంతో చేతులకు గాయాలయ్యాయి.
ఆ వెంటనే జనం గుమిగూడటంతో జైద్ అక్కడి నుంచి పారిపోయి సమీపంలోని ఓ టెంట్ హౌజ్ షాపులోని కౌంటర్ వెనుకలా దాక్కున్నాడు. రక్తం అధికంగా స్రావం జరుగుతున్నా రాహుల్ ఆ జైద్‌ను వెంటాడే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ తర్వాత కిందపడిపోయాడు. అక్కడున్నవారు జైద్ దాక్కున్న ఆ టెంట్ హౌజ్ షాప్ షటర్ మూసేశారు.
Also Read: Karnataka: బస్సుల్లో ప్రయాణం ఉచితం.. ఆటోవాలాలాకు సంకటం.. ప్రయాణికులు లేక విలవిల
స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. కానీ, అంతలోనే జైద్ మిత్రులు, బంధువులు స్పాట్‌కు వచ్చి బలవంతంగా ఆ షటర్ ఓపెన్ చేశారు. పోలీసులు వచ్చే లోపే వారంతా అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులు హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి జైద్ కోసం గాలిస్తున్నారు. ఈ ఏరియాలోని సున్నిత పరిస్థితుల కారణంగా పోలీసులు వెంటనే భద్రతాపరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ సోను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.
