తందూరి రోటీ  వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. మీరట్ లోని ఓ పెళ్లిలో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే... పెళ్లి భోజనాల్లో తందూరి రోటీ తయారు చేసే క్రమంలో ఆ వ్యక్తి రోటీమీద ఉమ్మి వేస్తున్నాడు. దీంతో నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేశారు. 

ఈ వీడియో చూసిన తరువాత ఇంట్లో స్వయంగా చేసుకున్న ఆహారం తప్ప ఇలా పెళ్లిళ్లు, విందుల్లో ఆహారం తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ వ్యక్తిని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఉత్తరప్రదేశ్, మీరట్ లోని అరోమా గార్డెన్స్ లో ఫిబ్రవరి 16న జరిగిన ఓ పెళ్లిలో ఈ సంఘటన జరిగింది. పెళ్లికి హాజరైన అతిథుల్లో ఎవరో ఈ వీడియోను రహస్యంగా తీశారు. ఆ తరువాత దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. షేర్ చేసుకున్న ఓ వ్యక్తి మీరట్ పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. 

అంతేకాదు అతిథులకు శుభ్రమైన భోజనం అందించాల్సిన క్యాటరర్స్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం ఏంటని ప్రశ్నల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఇలాంటి పనులు అస్సలు క్షమించరాదని నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇలాంటి గలీజ్ పనికి పాల్పడ్డ ఆ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ వంటవాడిని అరెస్ట్ చేశారు. అతన్ని నౌషాద్ అలియాస్ సోహైల్ గా గుర్తించారు. 

మీరట్ పోలీసుల ట్విట్టర్ వివరాల ప్రకారం, అతనిపై ఐపిసి 268, 269, 188 మరో మూడు అంటువ్యాధుల చట్టాల కింద కేసు నమోదైంది. దీని ప్రకారం నిందితుడికి కనీసం మూడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది.  లాయర్ యశోద యాదవ్, హిందూ జాగ్రన్ మంచ్ కార్మికుల సహాయంతో ఈ వ్యక్తిని పట్టుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ తందూరి రోటీ వీడియో మీద రీ ట్వీట్ల వర్షం కురుస్తోంది. కొందరు దీన్ని చూసి షాక్ అవుతుంటే.. మరికొందరు పెళ్లిళ్లలో భోజనం చేయాలంటే భయపడే పరిస్థితి కల్పించాలరంటూ మండిపడుతున్నారు.