అడగగానే సిగరెట్ ఇవ్వలేదని.. ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆమిర్‌ ఖాన్‌ (23) అనే యువకుడు గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన స్నేహితునితో కలిసి ఓ షాపింగ్‌మాల్‌ సమీపంలో నిల్చున్న సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆమిర్‌ ఖాన్‌ను సిగరెట్‌ ఇవ్వమని అడగ్గా.. అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. 

ఇంతలో ఓ దుండగుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆమీర్  ఛాతిలోకి తూటా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.