కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు, ఎవరిపై ఎలా ఎటాక్ చేస్తుందో తెలియక భయపడిపోతున్నారు. ఈ కరోనా సోకిన తర్వాత చాలా మంది ప్రాణాలు కోల్పోతుండటంతో.. మరింత భయపడిపోతున్నారు. ఎవరికైనా కరోనా సోకింది అని తెలిస్తే.. అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ.. కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. కరోనా సోకి బాధపడుతున్నవారిని వదలకుండా.. వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. దాికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాలోని ఓ కోవిడ్ సెంటర్ లో.. కరోనా సోకి బాధపడుతున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కరోనా వార్డ్‌ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఏప్రిల్‌ 26న కరోనా సోకి నుపాడా జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ అడ్మిట్‌ అయ్యింది. అయితే అప్పటికే అదే ఆస్పత్రిలో చేరిన కరోనా సోకిన కామాంధుడు బాధితురాలిపై  అఘాయిత్యానికి యత్నించాడు. 

దీంతో నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేసింది. బాధితురాలి కేకలు విన్న తోటి కరోనా పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ‘నిందితుడు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను నేను రక్షించుకునేందుకు కేకలు వేయడంతో కరోనా బాధితులు తనని రక్షించార’ని పోలీసులకు తెలిపింది. 

ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు నుపాడా పీఎస్సై సంజుక్తా బార్లా తెలిపారు. ప‍్రస్తుతం నిందితుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నిందితుడ్ని మరో కోవిడ్‌ సెంటర్‌ తరలించినట్లు చెప్పారు.