ఈ-రిక్షా కోసం గొడవ పడి సొంత మేనల్లుడిమీదే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. అతడిని కాపాడబోయి మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ఒకరు మృతి చెందారు. 

ఉత్తరప్రదేశ్‌ : ఈ-రిక్షా కోసం గొడవపడి ఓ వ్యక్తి తన మేనల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కాంట్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. అతడిని రక్షించే ప్రయత్నంలో అతని భార్యతో సహా ఇద్దరు మహిళలకు కూడా కాలిన గాయాలయ్యాయి. కాన్పూర్ కాంట్‌లోని బద్లీపూర్వాలో బాధితుడు రామ్‌కుమార్ (40) తన భార్య సప్నా (35)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ ఘటనలో రామ్ కుమార్ భార్య సప్నా తీవ్ర కాలిన గాయాలతో మరణించింది.

ఇరుగుపొరుగు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో, రామ్‌కుమార్ తన మేనమామ అయిన రామ్ నారాయణ్ దగ్గరికి వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం ఇద్దరూ కలిసి భాగస్వామ్యంలో ఈ-రిక్షా కొనుక్కున్నారు. ఈ రిక్షా విషయంలోనే గొడవ జరిగింది.

అతిక్ అహ్మద్ తరహాలోనే.. యూపీ కోర్టులో ఇద్దరు హత్యా నిందితులపై దుండగుల కాల్పులు..

మంగళవారం ఉదయం, రామ్ నారాయణ్ ఒక చిన్న బకెట్ నిండా పెట్రోల్‌ తీసుకొచ్చి.. రామ్ కుమార్ మీద పోసి.. నిప్పంటించి పారిపోయాడు. రామ్‌కుమార్‌ అరుపులు విన్న సోదరి మోనిక, భార్య సప్న, పక్కింటి మహిళ రాజ్‌కుమారిలు మంటలను ఎలాగోలా ఆర్పారు. కానీ, ఈ క్రమంలో వారికి కూడా కాలిన గాయాలయ్యాయి.

బాధితుడి సోదరి మోనిక మాట్లాడుతూ, నిందితుడు తనపై, తన వదినపై టెర్రస్‌ మీది నుంచి పెట్రోల్‌ పోసి తగులబెట్టాడని తెలిపారు. తమని కూడా చంపాలని చూశాడని తెలిపింది. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన నలుగురిని ఉర్సల ఆసుపత్రికి తరలించారు, అక్కడ తీవ్రంగా గాయపడిన సప్న మరణించింది.

ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. కాన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, మోనికా, రాజ్‌కుమారి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ తెలిపారు.