కొడుకు తమతోపాటు ఉంటే అదృష్టం కలిసిరాదని జోతిష్యుడు చెప్పిన మాటలను ఓ వ్యక్తి నిజమని నమ్మేశాడు. కన్న కొడుకు అనే కనికరం లేకుండా.. ఐదేళ్ల  బాలుడిని అతి కిరాతకంగా సజీవదహనం చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరువారూరు, నన్నిలం పెరుమాళ్ ఆలయ వీధికి చెందిన రాంకీ(29), గాయత్రి దంపతులు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమవగా సాయిచరణ్(5), సర్వేష్(3) సంతానం ఉన్నారు.

డ్రైవర్ గా పనిచేసే రాంకీ కి జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువ. తరచూ ఓ జోతిష్యుడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ జోతిష్యుడు పెద్ద కుమారుడు సాయిచరణ్ ఉన్నంతకాలం నువ్వు బాగుపడవంటూ అతనిని నమ్మించాడు. అది నిజమని రాంకీ భావించాడు.

ఈ క్రమంలోనే పెద్ద కుమారుడిని దాదాపు 15 సంవత్సరాలపాటు హాస్టల్ లో ఉంచాలని భావించాడు. అయితే.. అందుకు అతని భార్య నిరాకరించింది. దీంతో ఈ విషయంలో భార్యభర్తలకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాంకీ.. పై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. 

ఆ ఘటనతో షాకైన భార్య గాయత్రి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి బాలుడుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... 90శాతం గాయాలైన చిన్నారి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.