కన్నుమిన్ను కానక జన్మనిచ్చిన తల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగారశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి మేటల్ ఫేబ్రికేటర్‌గా పనిచేసేవాడు.

అయితే తాగుడికి బానిస కావడంతో భార్య 2017లో అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ అతను తల్లిని ప్రతిరోజు హింసించేవాడు. ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్ 16 రాత్రి పీకలదాకా తాగొచ్చిన అతను తల్లి పక్కన పడుకున్నాడు.

అయితే తనకు దూరంగా నిద్రించాలని ఆమె కొడుకుని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతను తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. తర్వాతి రోజు ఉదయం పక్క వూరిలో ఉంటున్న కూతురి వద్దకు వెళ్లి కొడుకు చేసిన దారుణాన్ని చెప్పింది.

రెండు రోజుల తర్వాత కొడుకు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాపడ్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు కేసు నమోదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విచారణలో భాగంగా నిందితుడు తనపై మోపిన అభియోగాల్ని ఖండించాడు. అయితే తల్లి శరీరానికి అయిన గాయాల గురించి మాత్రం అతను నోరు విప్పలేదు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా తనపై తల్లి తప్పుడు కేసు పెట్టిందని నిందితుడు ఆరోపించాడు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు న్యాయవాది మెడికల్ రిపోర్ట్ సమర్పించడంతో న్యాయస్థానం అతనిని దోషిగా నిర్ధారించింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎంకే చౌహన్ తీర్పును వెలువరించారు.