పంజాబ్ లో ఓ విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి వివాహితకు ఐలైక్ యూ అని మెసేజ్ పెట్టి చిక్కుల్లో పడ్డాడు. అసలేం జరిగిందంటే...
పంజాబ్ : సోషల్ మీడియాలో ముఖం కనిపించదు, ఐడెంటిటీ తెలియదు కదా అని మహిళల్ని, యువతుల్ని వేధించే ఆకతాయిలు ఎక్కువై పోయారు. మహిళల ఫోన్ నెం. దొరికితే చాలు... వారిని మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తూ ఓ ఆట ఆడుకుంటారు. అదే క్రమంలో ఓ వివాహితను ఏడిపించాలనుకున్నాడు ఓ ఆకతాయి. ‘ఐ లైక్ యు’ అంటూ ఆమె ఫోన్ కు మెసేజ్ పెట్టాడు. దీంతో ఎవరో తెలియని వ్యక్తి ఇలా మెసేజ్ పెట్టడం ఏంటి అని ఆమె షాక్ కు గురయ్యింది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది.
భార్యకు అలా మెసేజ్ పెట్టే సరికి భర్తకు పట్టరాని కోపం వచ్చింది. రంగంలోకి దిగిన సదరు భర్త ప్రబుద్ధుడి వివరాలు సేకరించి.. ఇంటి అడ్రస్ తెలుసుకుని వెళ్లి మరీ చితకబాది.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆమెను ఏడిపిద్దానుకున్న ఆకతాయి. తనకు దేహశుద్ది జరగడంతో షాక్ అయ్యాడు. మళ్లీ ఆమె భర్త దాడి చేస్తాడని భయపడ్డాడు. దీంతో, బాధితుడు.. ట్విట్టర్ లో పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పాడు. దీనికి పోలీసులు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటే.. పంజాబ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ మొబైల్ కి i like you.. నువ్వంటే నాకిష్టం అనే మెసేజ్ వచ్చింది. అది గుర్తు తెలియని నెంబర్ నుంచి... దీంతో ఈ విషయం ఆమె భర్తకు తెలిపింది. అతను వచ్చి ఆ వ్యక్తి చితకబాదాడు. ఆ తర్వాత జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ట్విట్టర్ వేదికగా ‘సార్.. నేను ఒకరికి ‘ఐ లైక్ యు’ అని మెసేజ్ పంపాను.. ఆమె భర్త వచ్చి నన్ను కుళ్లబొడిచాడు. నేను చాలా సార్లు క్షమించమని అడిగాను. అయినా సరే అతను చితకబాదాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలనిపిస్తోంది. నన్ను కాపాడండి. ఆయన మళ్లీ నా పై దాడి చేసే అవకాశం ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
దీనికి పోలీసులు ట్విట్టర్ వేదికగానే బదులిచ్చారు.. ‘మీరు ఓ మహిళకు అలా మెసేజ్ పెట్టి.. ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారో.. మాకు తెలియదు. అలాగే ఆమె భర్త మాకు ఫిర్యాదు చేయకుండా మిమ్మల్ని అలా చితకబాదడం కూడా కరెక్ట్ కాదు. మేము మీకు సరైన సెక్షన్ కింద.. సరైన శిక్ష విధిస్తాం. ఈ రెండు అంశాలకు చట్టపరంగా దర్యాప్తు ఉంటుంది. ఇద్దరి పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
ఈ క్రమంలో.. పోలీసులు, మీ సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని స్పష్టం చేస్తూ.. ఓ సలహా కూడా ఇచ్చారు. అయితే, పోలీసుల నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించని బాధితుడు ఖంగుతిన్నాడు. ఫిర్యాదు చేసే అసలుకే మోసం వస్తుందనుకున్నాడో ఏమో కామ్ గా ఉండిపోయాడు. దీంతో, వీరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
