దేశమంతా  కరోనా బారినపడి అల్లాడుతోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఈ సారి ఆక్సిజన్ కొరత అధికంగా ఉంది. ఏ హాస్పిటల్ ముందు చూసిన ప్రాణవాయువు అర్థిస్తూ, ఆసుపత్రిలో చేర్చుకోమని వేడుకుంటున్న జనాలకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను తెలియజేస్తూ సహాయం కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోరుతూ ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించాడు. ఆ వివరాలు... ఉత్తరప్రదేశ్ కు చెందిన శశాంక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా .. తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. తనకు ఆక్సిజన్ సిలిండర్ అత్యవసరం అంటూ ట్వీట్ చేస్తూ నటుడు సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ సాయం చేయాల్సిందిగా కోరాడు.

శశాంక్‌ స్నేహితుడు అంకిత్‌ ఈ మెసేజ్ ని ఓ జర్నలిస్టు కి సెండ్ చేసి తన ఫ్రెండ్ కి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. సదరు రిపోర్టర్ ఈ మెసేజ్ ని షేర్ చేస్తూ స్మృతి ఇరానీని ట్యాగ్ చేశారు. అయితే ఈ మెసేజ్ లో ఎక్కడ కూడా శశాంక్ తాత కోవిడ్‌తో బాధపడుతున్నట్లుగా వెల్లడించలేదు. ఈ మెసేజ్ చూసిన స్మృతి ఇరానీ శశాంక్ కు సాయం చేద్దామని భావించి అతడికి మూడు సార్లు కాల్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.

దాంతో స్మృతి ఇరానీ ఈ మెసేజ్ ను అమేథీ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారికి సెండ్ చేసి వివరాలు కనుక్కోమని ఆదేశించారు, ఇదిలా ఉండగా శశాంక్ తాత చనిపోయినట్లు తెలిసింది, దాంతో స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. ‘‘శశాంక్‌ తన ట్వీట్‌లో షేర్‌ చేసిన నెంబర్ కు మూడు సార్లు కాల్ చేశాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో అమేథీ  డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, పోలీసులకు అతడి గురించి కనుక్కుని సాయం చేయాల్సిందిగా ఆదేశించాను’’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదులు: కేంద్ర మంత్రి నిర్మలా సీరియస్...

ఈ క్రమంలో అమేథీ  పోలీసులు శశాంక్ వివరాలు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే శశాంక్‌ తాత కోవిడ్‌ బారిన పడ లేదు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ‘అతని తాత కోవిడ్‌ బారిన పడలేదు. అసలే బయట జనాలు ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో తన సోషల్ మీడియాలో జనాలను భయపెట్టేలా ఇలా ట్వీట్ చేయడం సరైంది కాదు. పైగా అతను బయట ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నించ లేదు. డైరెక్టుగా యాక్టర్ సోనూసూద్ తనకు సాయం చేయమని కోరాడు. తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు అతనిని అరెస్టు చేశాం’ అన్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona