రాజస్థాన్: ఏదైనా శస్త్ర చికిత్స చెయ్యాలి అంటే రోగికి మత్తు మందు ఇవ్వడం సహజం. ఆపరేషన్ థియేటర్ లో రోగికి ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆపరేషన్ విజయవంతం కావాలంటూ రోగి బంధువులు దేవుళ్లను కోరుకుంటారు. ఇదంతా రొటీన్ గా జరిగే తంతు. 

కానీ రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ లో ఓ వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోగి బంధువులు చెయ్యాల్సిన ప్రార్థనలు ఆపరేషన్ థియేటర్లో రోగి చేశాడు. మూడు గంటలపాటు జరిగిన ఆపరేషన్ ఆద్యంతం హనుమాన్ చాలీషా పఠిస్తూ విజయవంతం చేసుకున్నాడు. 

బికనీర్ సమీపంలోని ఢూంగర్ గఢ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చెయ్యాలని వైద్యులు నిర్థారించారు. శస్త్ర చికిత్సకు ఆ రోగి సిద్ధమయ్యాడు. తీరా ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చేసరికి వైద్యులు ఓ బాంబు పేల్చారు. 

ఆపరేషన్ జరుగుతున్నంత సేపు మెలుకువగా ఉండాలని చెప్పారు. అంతేకాదు మత్తుమందు ఇవ్వకుండా బ్రెయిన్ కు ఆపరేషన్ చెయ్యాలని చెప్పడంతో అతడు ఖంగుతిన్నాడు. ఆ తర్వాత తేరుకుని సరే అని చెప్పాడు.  

వైద్యులు ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఆ రోగి హనుమాన్ చాలీసా చదువుతూ గడిపాడు. అలా మూడు గంటలపాటు బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేకే బన్సల్ స్పందించారు. 

బాధితునికి బ్రెయిన్‌లోని ఒక వైపు ట్యూమర్ ఉందని ఈ సర్జరీ ఎంతో క్లిష్టతరమైనదిని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ లో ఏ మాత్రం తేడా జరిగిన అతడు మాట్లాడే శక్తిని కోల్పోతాడు. అందువల్ల అతడు స్పృహలోనే ఉంచాలని నిర్ణయించుకున్నాం. సర్జరీ సమయంలో అతనితో మాట్లాడుతూనే ఉన్నాం.  

ఆపరేషన్ సమయంలో బాధితుడు హనుమాన్ చాలీసా పఠిస్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. బ్రెయిన్‌లోని ఆ భాగం సర్జరీ చేస్తున్న సమయంలో మాట్లాడుతూ ఉంటే అది డ్యామేజ్ కాకుండా ఉంటుందని అందువల్లే అలా చెయ్యాల్సి వచ్చిందన్నారు. 

ఆపరేషన్ సమయంలో రోగి హనుమాన్ చాలీసా చదవడం ఎంతో ఉపకరించిందని దీంతో ఆపరేషన్ విజయవంతంగా చేయగలిగామని వైద్యులు చెప్పారు. హనుమాన్ చాలీషా పఠించడం వల్లే తాను బతికానని ఆ హనుమాన్ తన ఆపరేషన్ విజయవంతం అయ్యేలా చేశారని రోగి తెలిపాడు.