దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి చట్టం ఎన్ని కఠిన శిక్షలు తీసుకువచ్చినా.. గతంలో దారుణాలకు పాల్పడిన నేరస్థులను ఉరితీసినా కూడా  ఇంకా చాలా మంది కామాంధుల్లో మార్పు రావడం లేదు. కనీసం చట్టం, న్యాయం పట్ల భయం కలగడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే చాలు దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా.. మరో దారుణం చోటుచేసుకుంది.

దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీప ప్రాంతంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. 

కాగా, ఆ మృగం నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో యువతి తల నుంచి విపరీతంగా రక్తం కారడాన్ని పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ కేసులో నిందితుడికి, బాధితురాలికి మధ్య పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.