ముంబై: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత అమానవీయ ఘటనకు తెరతీశాడు. భార్యను అనుమానిస్తూ శీల పరీక్ష చేశాడు. వేడి నూనెలో చేతులు పెట్టించి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించారు.ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్ లో  ఈఘటన చోటు చేసుకొంది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ నెల 11వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో భార్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. నాలుగు రోజుల పాటు  భార్య కోసం భర్త గాలించాడు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. ఐదో రోజు భార్య ఫోన్ చేసి ఇంటికి వచ్చింది.

భర్తతో గొడవపడిన రోజున కచాపురి చౌక్ లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి తనను బలవంతంగా ఎత్తుకెళ్లారని భార్య చెప్పింది. నాలుగు రోజుల పాటు తన వద్దే ఉంచుకొన్నారని చెప్పింది. తనను ఏమీ చేయలేదని ఆమె భర్తకు చెప్పింది.

వారి నుండి తాను ఎలాగోలా తప్పించుకొని వచ్చినట్టుగా ఆమె భర్తకు తెలిపింది.  ఈ విషయాలను భర్త నమ్మలేదు.పాతివ్రత్యాన్ని పరిరక్షించాలనా నిర్ణయం తీసుకొన్నాడు. 

వేడి నూనెలో ఐదు రూపాయాల బిళ్లను వేసి దాన్ని బయటకు తీయాలని పరీక్ష పెట్టాడు. తప్పు చేస్తే ఆమె చేతులు కాలుతాయని... తప్పు చేయకపోతే ఆమె చేతులు కాలవని  ఆయన చెప్పారు. తన భార్య వేడి నూనెలో చేతులు పెట్టే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఈ వీడియోపై మహిళా సంఘాల నేతలు, సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.