స్నేహితుడి ట్రాన్స్‌ఫర్‌లో మార్పులు చేసేందుకు గాను ఓ వ్యక్తి ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా పీఏ నంటూ హల్ చల్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రేనాకు చెందిన అభిషేక్ ద్వివేది స్నేహితుడిని గ్వాలియర్‌లోని పరివాహన్ ఆయుక్త్ కార్యాలయానికి బదిలీ చేశారు అధికారులు.

అయితే అతను మరో జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కావాలని భావించాడు. దీంతో చేసేది లేక అతను అభిషేక్‌ను సాయం కోరాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న ద్వివేది ... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి తాను అమిత్ షా పర్సనల్ సెక్రటరీనని పరిచయం చేసుకున్నాడు.

అనంతరం తన స్నేహితుడి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరాడు. అతని మాట తీరుతో అనుమానం వచ్చిన సిబ్బంది.. దీని గురించి అమిత్ షా సిబ్బందికి సమాధానం అందించారు.

దీంతో వారు ఈ ఫోన్ కాల్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. అభిషేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. తన కోసం పోలీసులు వెతుకున్నట్లుగా గుర్తించిన అభిషేక్.. ముంబై పారిపోయాడు.

అయినప్పటికీ అతని కోసం ముంబైలోని కోలాంబేలి, ఖార్గర్, బేలాపూర్, తలోజా ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అభిషేక్‌ను ఇండోర్‌లో పట్టుకున్నారు. ఈ క్రమంలో అతని వద్ద మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. తన బాల్య మిత్రుడి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌ను రద్దు చేసేందుకే తాను ఇలా చేశానని అభిషేక్ చెప్పాడు.