తన భార్యను, మరదలని వేధిస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రంలోని హసన్ ప్రాంతానికి చెందిన మోహన్, రమ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు.

ఆ స్నేహం వీరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఈ జంట పెద్దల అంగీకారంతో భార్యభర్తలుగా మారారు. పెళ్లయ్యాక బెంగళూరులోని రాజగోపాల్ నగర్‌లో కాపురం పెట్టారు. మోహన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి మధు అనే మరో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు మంచి స్నేహితులవ్వడంతో.. మధును మోహన్ తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మోహన్ భార్య రమ్యపై మధు కన్ను పడింది.

మోహన్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి పలుమార్లు వెళ్లిన మధు తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని రమ్యను వేధించసాగాడు. తన మాట వినకుంటే ‘‘ నీ క్యారెక్టర్ గురించి మోహన్‌కు అబద్ధాలు చెబుతా’’నంటూ ఆమెను బెదిరించాడు.

దీంతో తన భర్త ఆ మాటలు నమ్మి ఎక్కడ తనను వదిలేస్తాడోనన్న భయంతో రమ్య మూడు నెలలుగా అతని వేధింపులను భరిస్తూ వచ్చింది. అయితే మధు అక్కడితో ఆగకుండా.. రమ్య చెల్లెలు బిందును కూడా వేధించం మొదలుపెట్టాడు.

సహనం నశించడంతో రమ్య జరిగినదంతా భర్త మోహన్‌కు చెప్పింది. దీంతో అతను తన కుటుంబానికి దూరంగా ఉండాల్సిందిగా మధును హెచ్చరించాడు. కానీ.. మోహన్ వార్నింగ్‌ను పట్టించుకోని మధు ఎప్పటిలాగే రమ్య, బిందులను వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని భావించిన మోహన్.. మధు హత్యకు కుట్ర పన్నాడు. రమ్యతో అతనికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. మధు ఇంటికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఇనుపరాడ్‌తో రమ్య.. మధు తలపై కొట్టాల్సిందిగా చెప్పాడు.

భర్త చెప్పినట్లుగా రమ్య అతని తలపై బలంగా మోదింది. తీవ్ర గాయాలపాలైన మధు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రమ్య, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు.