ఆమె ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో  ఓ యువకుడు ప్రేమ పేరిట వేధించాడు. అయితే.. అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించింది. దాదాపు రెండేళ్ల తర్వాత.. ఆమెకు సడెన్ గా వేధింపులు మొదలయ్యాయి. ఎవరు తనను ఫోన్ కాల్స్ తో వేధిస్తున్నారో కూడా ఆమెకు తెలీలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సడెన్ గా ఆమెకు తెలిసిన విషయం ఏమింటే.. కాలేజీలో తనను ప్రేమించిన యువకుడే ఇలా వేధిస్తున్నాడని తెలిసి కంగుతిన్నది. అప్పుడు తాను ప్రేమను కాదు అని చెప్పినందుకు కక్ష పెంచుకొని హైటెక్ తరహాలో ఆమెను వేధించడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరభారతదేశానికి చెందిన 24 ఏళ్ల యువతి నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీగా పనిచేస్తూ వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటోంది. నెలక్రితం స్కైప్‌ ద్వారా గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చా యి. సదరు వ్యక్తి అశ్లీలంగా మాట్లాడాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాధ్యం కాలేదు. 

ప్రతిరోజు ఇదే విధంగా కాల్స్‌ వస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ఇతరుల సాయంతో కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. కుటుంబ సలహా కేంద్రం సిబ్బంది సైబర్‌ పోలీసులసహకారం  తీసుకున్నా సదరు నిందితుడి ఆచూకీ లభించలేదు.  

తర్వాత దర్యాప్తులో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. కళాశాలలో చదువుతున్న సమయంలో తన ప్రేమను తిరస్కరించిందని క్లాస్‌మెట్‌ అయిన యువకుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు. రెండేళ్ల తరువాత ఆమె గురించి ఆరా తీసి ఫోన్‌ చేయ డం ప్రారంభించాడు. యువతి ఫిర్యాదు మేరకు కుటుంబ సలహా కేంద్రం అధికారులు వివిధ మార్గాల్లో సదరు వ్యక్తి గురించి ఆరా తీయగా అతను ముంబయిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా యువతి క్లాస్‌మెట్‌గా గుర్తించారు.

కుటుంబ సలహా కేంద్రం అధికారులు సదరు యువకుడికి ఫోన్‌ చేసి విచారణ చేయగా మొదట తనకు సంబంధం లేదని చెప్పినా చివరకు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి యువతి ఆశ్చర్యపోయింది. అనంతరం ఇద్దరిని కలపడంతో సదరు వ్యక్తి యువతికి క్షమాపణ చెప్పడంతో బాధితురాలు కేసు ఉపసంహరించుకోవడంతో కథ సుఖాంతమైంది.