Asianet News TeluguAsianet News Telugu

వారిద్దరినీ లవ్ చేస్తున్నా.. విడిచి ఉండలేను.. ఒకే మండపంలో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్‌లను పెళ్లి చేసుకున్న వరుడు

జార్ఖండ్‌లో ఓ వ్యక్తి ఒకే వేడుకలో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. సంతానం కూడా కలిగింది. ఆ తర్వాత పని కోసం వలస వెళ్లి అదే గ్రామానికి చెందిన మరో యువతితో పరిచయాన్ని పెంచుకుని ప్రేమించాడు. చివరకు వారిద్దరినీ పెళ్లి చేసుకోవాలని గ్రామపెద్దలు తీర్పు ఇచ్చారు.
 

man marries 2 women in same ceremony in jharkhand.. says he loves both of them
Author
Ranchi, First Published Jun 21, 2022, 6:35 PM IST

రాంచీ: ఇటీవలి కాలంలో విచిత్రమైన పెళ్లిళ్ల గురించి ఎక్కువ వార్తలు వింటున్నాం. పెళ్లికి సంబంధించి, ప్రేమకు సంబంధించి చిత్ర విచిత్ర కథనాలు వస్తున్నాయి. జార్ఖండ్‌లో జరిగిన పెళ్లి ఇదే కోవలోకి చేరుతుంది. ఓ వ్యక్తి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్‌లను ఒకే వేదికపై పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. జార్ఖండ్‌లోని లోహర్‌దాగా గ్రామానికి చెందిన సందీప్ ఒరావోన్ అనే వ్యక్తి ఇద్దరు యువతులను ఇష్టపడ్డాడు. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వారిద్దరిలో ఏ ఒక్కరినీ తాను విడిచి ఉండలేనని చెప్పాడు. ఇంతకీ ఈ పెళ్లి కథ ఏమిటో ఓ సారి చూద్దాం.

సందీప్ మూడేళ్లుగా కుసుమ్ లక్రా అనే యువతితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వారిద్దరికీ సంతానం కూడా కలిగింది. అయితే, సందీప్ ఇటుక బట్టీల్లో పని వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్ వెళ్లడం వారి జీవితాలను మరో మలుపు తిప్పింది.

అక్కడ ఇటుక బట్టీల్లో పని చేస్తుండగా.. సందీప్ లాగే పశ్చిమ  బెంగాల్‌కు వలస వచ్చిన యువతి స్వాతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంత చనువుగా మారింది. వారిద్దరూ అక్కడి నుంచి తిరిగి తమ తమ ఇంటికి వచ్చిన తర్వాత వారి మధ్య సంబంధం కొనసాగింది. అప్పుడప్పుడు చాటుగా కలుసుకునేవారు. అయితే, ఆ గ్రామస్తులు, వీరి ఇరువురి కుటుంబ సభ్యులకు వారి వ్యవహారం గురించి తెలిసింది. వారి మధ్య సంబంధాన్ని వారు వ్యతిరేకించారు. విషయం బహిరంగం కావడంతో గొడవలు జరిగాయి. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పంచాయితీ పెట్టారు.

గ్రామస్తులు అంతా కలిసి పంచాయితి పెట్టి సందీప్, కుసుమ్ లక్రా, స్వాతి కుమార్‌లను విచారించారు. సందీప్‌ను ప్రశ్నించారు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. సందీప్ వారిద్దరినీ పెళ్లి చేసుకోవాలని ఆదేశించారు. ఊరి పెద్దలు చేసిన ఈ తీర్మానానికి ఆ ఇద్దరు మహిళల్లో ఒక్కరూ వ్యతిరేకించలేదు. అలాగే, వారి కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఒకే వేడుకలో వారిద్దరినీ సందీప్ పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత సందీప్ ఇండియా టుడే మీడియాతో మాట్లాడుతూ, ఒకే సారి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడం లీగల్ ఇష్యూ అవుతుందేమోనని అన్నారు. కానీ, తాను వారిద్దరినీ ఇష్టపడుతున్నారని, ఇద్దరిలో ఏ ఒక్కరినీ విడిచి ఉండలేనని సెలవిచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios