మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగిన యువకుడికి ఆ యువతి కుటుంబీకులు సంతోషంగా అంగీకారం తెలిపారు. మంచి రోజు చూసుకొని.. పెళ్లి గురించి మాట్లాడుకుందాం.. ఇంటికి రావాల్సిందిగా ఆ యువకుడికి ఆహ్వానం కూడా పలికారు. అదంతా నిజమని భావించిన యువకుడు ఎంతో ఆనందగా తన ప్రేయసి ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పిల్లనిస్తామని చెప్పి చావు అంచుల్లోకి తోశారు. దీంతో.. ప్రస్తుతం ఆ యువకుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ టా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈటా ప్రాంతానికి చెందిన నరేంద్ర సఖ్య(22) అనే యువకుడు ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. అతను కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ విషయం యువతి కుటుంబీకులకు తెలిసింది. వారి ప్రేమను అంగీకరించినట్లు మాట్లాడారు.

పెళ్లి విషయాలు మాట్లాడాలి.. ఇంటికి రమ్మని నరేంద్రను యువతి కుటుంబీకులు ఆహ్వానించారు. ఎంతో ఆనందంగా అక్కడికి వెళ్లిన యువకిని గదిలో బంధించి నిప్పు పెట్టారు. కాగా యువకుడు 90శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.