నోట్లో సిగరెట్ వెలిగిస్తూ.. ఒక చేతిలో రాకెట్లు పట్టుకుని మరో చేతితో వాటిని అంటించి చకచకా వాటిని ఆకాశంలోకి పంపిస్తున్న ఓ పెద్దాయన వీడియో సోషల్ మీడియాలో పిచ్చిగా వైరల్ అవుతున్నది. దీపావళి ముందుగా పోస్టు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పేలుస్తున్నారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతున్నది. ఓ పెద్దాయన నోట్లో సిగరెట్ వెలిగించాడ. ఎడమ చేతిలో సుమారు డజను రాకెట్లు పట్టుకున్నాడు. కుడి చేతితో ఒక్కో రాకెట్ తీసుకుంటూ వెలుగుతున్న సిగరెట్‌తో అంటించి వదిలిపెడుతున్నాడు. ఆ రాకెట్లు రయ్ మంటూ ఆకాశంలోకి వెళ్లిపోయాయి. 20 సెకండ్లలోనే 11 రాకెట్లను కాల్చిన ఆ పెద్దాయన సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇది పాత వీడియోనే.. కానీ, దీపావళి ముందర మరోసారి సూపర్ వైరల్ అయింది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుసంత నందా దివాలీ ముందే పోస్టు చేశారు. ఈ వీడియోతోపాటు నాసా వ్యవస్థాపకుడు కచ్చితంగా భారతీయుడే అయి ఉంటాడు అంటూ క్యాప్షన్ జోడించారు. 20 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో ఓ పెద్దాయన ఎంతో ఈజ్‌గా రాకెట్లు కాల్చారు. రోడ్డు నడిమధ్య నిలబడి చాలా సింపుల్‌గా, క్లాస్‌గా కాల్చేశాడు. కొందరైతే రాకెట్లు కాల్చడానికి వెనుకా ముందాడుతారు. కొన్నిసార్లు రిహార్సల్ చేసి తర్వాత దానికి నిప్పు అంటిస్తారు. కానీ, ఈ వీడియోలో పెద్దాయన ఫీట్ చేసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోకు సుమారు పది లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక మరికొందరు నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు విసిరారు. కొందరు సింపుల్‌గా ఆయనను రజనీకాంత్ అని పేర్కొన్నారు. మరికొందరు రాకెట్ మ్యాన్ అని పిలిచారు. ఇంకొందరైతే.. ఆయనను స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌కు పరిచయం చేయాలని సజెస్ట్ చేశారు.
