సాఫ్ట్ వేర్ జాబ్ చాలు ఈ జన్మకు అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఆ పని నచ్చక గోలీ సోడా వ్యాపారం మొదలు పెట్టి నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇంతకీ అతనెవరంటే?
జీవితంలో ఏ పనిచేసినా.. అది మనసుకు ఆనందానివ్వాలి. సంతృప్తినివ్వాలి. లేదంటే కోట్లు సంపాదిస్తున్నా కొంచెం కూడా ఆనందం కలగదు. అందుకే ఓ వ్యక్తి ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి గోలీసోడా వ్యాపారాన్ని ప్రారంభించాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అతనేం తెలివితక్కువ పనిచేయలేదు. ఈ గోలీసోడా వ్యాపారంతో సాఫ్ట్ వేర్ జాబ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. నెలకు లక్షల్లో సంపాదిస్తూ.. కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి గురించి మాత్రం ఎవ్వరికీ తెలియకపోవచ్చు. అతనెవ్వరు? నెలకు ఎంత సంపాదిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి జీతంతో ఓ టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు రఘునాథ్. అయితే ఆ జాబ్ అతనికి సంతృప్తినివ్వలేదు. దీంతో అతను పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. పాత కంపెనీలో పనిచేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఫేమస్ అయిన గోలీ సోడా అనే రిఫ్రెషింగ్ డ్రింక్ ను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఇతను 20 ఏండ్ల కిందట కరీంనగర్ లోని గోలీసోడాను తయారు చేసే వ్యాపారులను చూడాడట. ఆ ఇమేజ్ ఎప్పటికీ తన మదిలో స్థిరపడిందట. అయితే ఐటీ సంస్థలో పనిచేస్తున్నప్పుడు తను ఉంటున్న ప్రాంతంలో ఎవరూ గోలీసోడాలను అమ్మవారు కాదట. దాంతో అతను గోలీసోడా వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఏదేమైనా ఇది అంత సులువేం కాదు. దీనికోసం అతను ఉద్యోగం మానేయాలనుకున్నాడు. కానీ అప్పటికీ తనకు ఇంకా పెళ్లి కాలేదు. ఉన్న ఉద్యోగం మానేసి.. గోలీసోడా వ్యాపారం సక్సెస్ కాకపోతే తనకు పెళ్లి ప్రపోజల్ కూడా రాదన్న సంగతి రఘునాథ్ కు తెలుసు.
తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత..
జాబ్ మానేసి గోలీసోడా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న విషయాన్ని రంగనాథ్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ వారు మొదట్లో ఒప్పుకోలేదు. అయినా వెనక్కి తగ్గకుండా ఇతను అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు.
2020 లో ఉద్యోగానికి సాఫ్ట్ వేర్ జాబ్ కు రిజైన్ చేసి గోలీసోడా కంపెనీలో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి కోసం ఎన్నో అప్పులు చేశాడు. తన ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అయితే అతని కృషి, అభిరుచి అతనికి మంచి ఫలితాన్నిచ్చింది. ఇప్పుడు ఇతను ఏకంగా నెలకు లక్షలు సంపాదిస్తూ 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
