ప్రతీకారం తీర్చుకోవడానికి యూ ట్యూబ్ లో చూసి బాంబు తయారీ నేర్చుకున్నాడో వ్యక్తి. అంతేకాదు అది పనిచేస్తుందో లేదోనని ప్రయోగించి చూసి మరీ.. పక్కింటి వాళ్ల మీద వేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. 

మీరట్ : పక్కింటి వాళ్ళతో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆపై అది పనిచేస్తుందో లేదో పరీక్షించి కూడా చూశాడు. ఓకే అనుకున్న తర్వాత దాన్ని పక్కింటి వారిపై ప్రయోగించాడు. ఉత్తరప్రదేశ్లో భాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన పోలీసులనే విస్తుపోయేలా చేసింది. పక్కింటి వాళ్ళతో తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన 45 ఏళ్ల రణవీర్ సింగ్ ప్రతీకారం కోసం పరిపరివిధాలా ఆలోచించాడు. 

చివరికి యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. తయారీ పూర్తయిన తర్వాత దానిని పొలాల్లోకి తీసుకెళ్లి పలుమార్లు పరీక్షించి చూశాడు. పనిచేస్తోందని నిర్ధారించుకున్న తర్వాత తాను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారానికి బాంబు అమర్చాడు. విషయం తెలియని ఆ ఇంటి యజమాని 17 ఏళ్ల కుమారుడు గౌతమ్ సింగ్ డోర్ తెరవడంతో బాంబు పెద్ద శబ్దంతో పేలి పోయింది. ఈ ఘటనలో కుర్రాడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడింది రణవీర్ సింగేనంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. యూట్యూబ్ లో చూసి రణవీర్ సింగ్ బాంబులు తయారు చేయడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని భాగ్ పట్ ఎస్పీ నీరజ్ జాదౌన్ పేర్కొన్నారు. తమ ఎదుట బాంబులు తయారు చేయమని కోరగా వెంటనే తయారు చేసి చూపించాడు అన్నారు. దానికి మరికొన్ని అదనపు ఏర్పాటు చేసి బాంబును మరింత శక్తివంతంగా తయారు చేశాడని తెలిపారు. సమాజానికి హాని చేసే ఇలాంటి వీడియోలను తొలగించాలంటూ యూట్యూబ్ కు లేఖ రాసినట్లు ఎస్పి తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక (13), యూట్యూబ్ లో ఓ వీడియో చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కోవిడ్ తో మృతి చెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. 

అయితే, ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. 

బ్లేడ్, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్ రూమ్ కు వెళ్లి బ్లేడ్ తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి 11 గంటలకు మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.