ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ అత్తగారిని చంపేశాడు. మామ ను కూడా చంపేద్దామని అనుకున్నాడు. అతను జస్ట్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే తనను తాను కాల్చుకొని చంపేశాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమిత్ అగర్వాల్(42) చార్టెడ్ ఎకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కొన్ని సంవత్సరాల  క్రితం శిల్పి ధందానియాతో వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. వీరు బెంగళూరులో నివసిస్తున్నారు. గత కొద్దికాలంగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో వారు విడాకులు కూడా తీసుకుందామని అనుకుంటున్నారు. కాగా.. అమిత్ ఇటీవల తన భార్య శిల్పిని కాల్చి చంపేశాడు. వెంటనే అక్కడి నుంచి తన భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ అత్త, మామలతో చాలా సేపు గొడవ పడ్డాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో భార్య తల్లి లలిత దందానియాను పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చి చంపేశాడు.

అల్లుడు చేసిన షాకైన మామ వెంటనే తేరుకొని ఇంటికి బయట గడియ పెట్టి.. పరుగులు తీశాడు. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. వారు వచ్చి చూసే సరికి  అమిత్ కూడా శవమై కనిపించాడు. అత్తగారిని చంపిన తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు  తెలుస్తోంది.

అతని పక్కనే సూసైడ్ లెటర్ కూడా ఉంది. అందులో తాను కోల్ కతా రాకముందే బెంగళూరులో భార్యను చంపినట్లు రాసి ఉంచాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై.. బెంగళూరులోని అతని ఇంట్లో సోదాలు చేయగా.. అక్కడ అమిత్ భార్య శిల్పి చనిపోయి ఉంది. కుటుంబ కలహాల కారణంగానే అమిత్ ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.