పెళ్లి చేసుకుని నెలలు గడుస్తున్నా భార్యను ఆయన వద్దకు పంపించలేదు. మంచి రోజు చూసుకుని తమ బిడ్డను మెట్టినింటికి పంపిస్తామని వారు చెప్పారు. ఓపిక నశించి వరుడు అత్తవారింటికి వెళ్లి నిలదీశాడు. వారు అదే సమాధానం చెప్పారు. పది రోజులు వెయిట్ చేసి మనస్తాపంతో అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబయికి చెందిన క్రిష్ణ కుమార్ గుప్తా బిహార్‌కు చెందిన రీమా కుమారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే వధువు కుటుంబం ఓ షరతు పెట్టింది. పెళ్లి అయ్యాక వెంటనే వధువు పంపించబోమని, ఒక మంచి రోజు చూసుకుని ఆమెను మెట్టినింటికి పంపిస్తామని చెప్పారు. వరుడు అందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 14వ తేదీన వారి పెళ్లి జరిగింది. వధువు షరతును దృష్టిలో పెట్టుకుని బిహార్‌లో పెళ్లి తంతు ముగిసిన తర్వాత వరుడు, వరుడి కుటుంబం తిరిగి ముంబయికి వెళ్లిపోయింది. మంచి రోజు చూసి పంపిస్తామన్న వధువు కుటుంబం రోజులు దాటవేస్తూ వచ్చింది. నెలలు గడిచాయి. అయినా ఆమెను పంపలేదు. దీంతో ఎలాగైనా వెంట ఉండి తీసుకురావాల్సిందే అని తీర్మానించుకుని క్రిష్ణ కుమార్ గుప్తా మళ్లీ బిహార్‌కు బయల్దేరాడు.
బిహార్ వెళ్లాక వధువు కుటుంబంతో మాట్లాడాడు. తనతో వెంటనే వధువును పంపించాలని అన్నాడు. వధువును పంపించడానికి ఆమె కుటుంబం ఒప్పుకుంది. కానీ, మంచి రోజు కోసం ఎదురుచూడాలని, ఇప్పట్లో మంచి రోజు లేదని చెప్పింది. అలా రోజులు దాటవేస్తూ దాదాపు పది రోజులు ఆ వరుడు వారింటిలోనే ఉన్నాడు. అయినా వధువును పంపలేదు. దీంతో ఆ వరుడు మనస్తాపానికి గురయ్యాడు. భార్యను తనతో పంపించడం లేదని బాధతో అదే ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని ఆరా జిల్లాలోని ఏక్వారి గ్రామంలో చోటుచేసుకుంది.
మంచి రోజు ఇప్పట్లో లేదని, మరికొంత కాలం ఆగాలన్న వధువు కుటుంబం మాటలు విని వరుడు క్రిష్ణ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి వారి ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. అత్తమామలు తరుచూ తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు.
ఆయన డెడ్ బాడీని ఆరాలోని సదర్ హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆఫీసర్ ఇంచార్జీ పూజా కుమారి మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఇది వరకు రాతపూర్వక ఫిర్యాదు ఏమీ తమకు ఇవ్వలేదని వివరించారు. ఆత్మహత్యకు పురికొల్పిన ఆరోపణల కింద సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆయన హత్యకు గల మూల కారణాలు తెలుసుకుంటామని తెలిపారు.
